నిరాసక్తత.. అసెంబ్లీ పై ఉన్న శ్రద్ధ పార్లమెంట్ పై ఏది..?

by Disha Web Desk 12 |
నిరాసక్తత.. అసెంబ్లీ పై ఉన్న శ్రద్ధ పార్లమెంట్ పై ఏది..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్: పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా పక్షం రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. ప్రచారపర్వంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దూకుడుగా వెళ్లిన ప్రధాన రాజకీయ పార్టీలు పార్లమెంటు ఎన్నికల సమయంలో అంటీముంటన్నట్లుగా ఎందుకు ఉంటున్నాయన్న అభిప్రాయాలు రాజకీయ పక్షాల నేతలతో పాటు సామాన్య జనం నుంచి ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు నెలల ముందు నుంచే ప్రతిరోజు మందు సహా మాంసం పార్టీలతో తేలియాడిన ఓటర్లు... అసెంబ్లీ ఎన్నికలతో బేరీజు వేసుకుంటూ పార్లమెంటు ఎన్నికలను తూచ్ అన్నట్లుగా భావిస్తున్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఓటర్లను ప్రత్యక్షంగా ప్రసన్నం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ధూంధాం..

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. అప్పటి అధికార భారత రాష్ట్ర సమితి సహా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో నదీ ప్రవాహంలా ఖర్చు చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిరోజు గ్రామస్థాయిలో, వార్డు స్థాయిలో ఓటర్లకు మద్యం పంపిణీ జరిగింది. ఇక ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి మద్యంతో పాటు మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేయడం సహా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భిన్న రకాలుగా డబ్బులు ఖర్చు చేశారు. కుల సంఘాలతో పాటు గుళ్ళు గోపురాలకు పెద్ద ఎత్తున చందాలు ఇచ్చారు. ఎన్నికలకు వారం రోజుల ముందు నుంచి ఆయా నియోజకవర్గాలను బట్టి ప్రతి ఓటరుకు రూ. 300 వెయ్యి రూపాయల దాకా ముట్ట చెప్పారు.

ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల నియోజకవర్గాల్లో అయితే భారీ ఎత్తున ఖర్చు సాగింది. జీవన్మరణ సమస్యగా భావించిన రాజకీయ పార్టీలు చేతికి నరం లేకుండా డబ్బులు ఖర్చు చేశారు. ఒక్క నిర్మల్ నియోజకవర్గం లోని 150 కోట్లకు పైగా రాజకీయ పార్టీలు ఖర్చు చేశాయని ప్రచారం జరిగింది. ప్రతి ఓటరును లెక్కపెట్టి ఇంటింటికి డబ్బులు పంపిణీ చేసిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనిపించింది. మిగతా నియోజకవర్గం బహుమతుల రూపంలో నజరానాలు అందజేశారు. దీనిపై అభ్యర్థుల గెలుపోటములు కూడా జరిగినట్లు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రచారం జరిగింది.

ఈ ఎన్నికల్లో రూపాయి లేదు..

ఇక వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కనీసం తమ వద్దకు రావడం లేదని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు డబ్బులు, నజరానాలు పక్కనపెట్టి కనీసం మందు సీసాలు కూడా ఇవ్వడం లేదన్న అభిప్రాయాలు ఓటర్ల లో కనిపిస్తున్నది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఆదిమ గిరిజనులకే టికెట్లు ఇచ్చాయి. భారత్ రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు టికెట్ ఇవ్వగా... భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ జి నగేష్ కు టికెట్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థి ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణకు టికెట్ ఇచ్చి బరిలో ఉంచింది. ముగ్గురు అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ఆర్థిక పరిస్థితులతో ముడి పెట్టకుండా కొనసాగిస్తున్నారు.

ఆయా పార్టీల స్టార్ కాంపైనర్లతో మాత్రమే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రత్యక్షంగా ప్రసన్నం చేసుకునే విషయంలో మద్యం, మాంసం, డబ్బుల పంపిణీ వంటి విషయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితులను బట్టి మరో పక్షం రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లకు ఆర్థికంగా పెద్దగా సహాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపైనే ఓటర్లు సహాయ రాజకీయ పార్టీలకు చెందిన గ్రామ, పట్టణ, మండల, జిల్లా స్థాయి నేతల్లో చర్చ జరుగుతున్నది. కనీసం తిరిగే ఖర్చులకు కూడా ప్రధాన రాజకీయ పక్షాలు డబ్బులు ఇవ్వడం లేదన్న అభిప్రాయాలు వారిలో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రదర్శించిన జోష్ పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు చూపడం లేదన్న ప్రశ్న ఓటర్లతో పాటు రాజకీయ పక్షాల నేతల్లో వ్యక్తం అవుతున్నది.



Next Story

Most Viewed