శ్రీవనం పేరిట కోల్ బెల్ట్ వాసులకు భూతల స్వర్గం..!

by Sumithra |
శ్రీవనం పేరిట కోల్ బెల్ట్ వాసులకు భూతల స్వర్గం..!
X

దిశ, మందమర్రి : రండి బాబు.. రండి.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో 100 ఎకరాల మెగా వెంచర్ ఏర్పాటు చేశాం. ఇందులో శ్రీ గంధం మొక్కలు పెంచుతాం కేవలం మీరు డబ్బులు కట్టి ప్లాటు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్లీ అదే ప్లాటును 15 సంవత్సరాలు మాకు లీజు అగ్రిమెంట్ ఇస్తే చాలు మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కాలుష్యం లేని ప్రశాంత వాతావరణం ఆరోగ్యానికి ఆహ్లాదాన్నిస్తుంది. అంటూ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు భూ వ్యాపారానికి కొత్త వన్నెలను తెరమీదకి తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శికి, మండల అభివృద్ధి, రెవెన్యూ ప్రభుత్వాధికారులకు ఎలాంటి సమాచారం లేదట. కాని ఎంచక్కా 100 ఎకరాల స్థలంలో జేసీబీ లారీలు లాంటి భారీ వాహనాలు పదుల సంఖ్యలో ట్రాక్టర్ వాహనాలు చదును చేయడం విడ్డూరంగా ఉంది. అందులో శ్రీ వనం వెంచర్ ఏర్పాట్లతో కూడిన సమాచారాన్ని పెద్ద పెద్ద కటౌట్లు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు.

ఈ ప్రాంగణంలో సొంత ఖర్చులతో రోడ్ల నిర్మాణాలు, వాగు పై వంతెన నిర్మాణం పనులు చక చక జరుగుతూనే ఉన్నాయి. శ్రీ వనం సృష్టికర్తలు బెల్లంపల్లి, మంచిర్యాలను డెన్ స్థావరాలుగా మలుచుకొని ప్లాట్లు అమ్మకాల బ్రోకర్లకు భారీ నజరానా అందజేస్తున్నట్లు సమాచారం. ఇక్కడి వెంచర్ సింగరేణి కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతానికి దగ్గరగా ఉండడం, ప్రతి ఆదివారం కార్మికులకు సెలవు దినం కావడం వల్ల అదే అదునుగా భావించి ప్లాట్ల విక్రయాలకు మధ్యవర్తుల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కొనుగోలు దారులను సొంత వాహనాలలో తీసుకురావడం ఇక్కడ జాతరగా తలపిస్తుందని చెప్పవచ్చు. ఈ విశాల వెంచర్ లో ఇక్కడ సిమ్మింగ్ ఫూల్, గోశాల, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మంగళ్య గౌరీ దేవాలయం, పాఠశాల తదితరులు నిర్మాణం అవుతున్నాయని చూపిస్తూ సందర్శకులకు ఊదరగొడుతున్నారు. ఇలా వచ్చిన వారికి మామిడి తోటలో బిర్యాని భోజనం చేపించి తిరిగి అదే వాహనంలో ఇంటికి పంపించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

శ్రీ వనంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ లకు వాటా ఉంది : బీఎస్పీ

మందమరి మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ లేమురు శివారులో కొత్తగా ఏర్పాటు చేసిన సిస్కో ఇన్ ఫ్రా, శ్రీ వనం రిసార్ట్స్ అండ్ ఫారం ల్యాడ్, బటర్ ఫ్లయ్ 100 ఎకరాల వెంచర్ లో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ, మందమర్రి, చెన్నూరు మంచిర్యాలలోని ముగ్గురు జడ్పీటీసీలు మరి కొంతమందికి ఇందులో వాటా ఉందని బీఎస్పీ జోనల్ కన్వీనర్ మద్దెల భవాని, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఎంవి గుణలు ఆరోపించారు. ఈ సంస్థ ప్రజలను నిలువు దోపిడీ చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందులో మామిడి తోటలు, రెండు ఒర్రెలు, హైటెన్షన్ పవర్ కేబుల్స్ ఉన్న అసైన్డ్ భూములతో కలిపి శ్రీ వనం పేరుతో దందా కొనసాగుతుందని అన్నారు. ఈ అక్రమ వెంచర్లకు డీటీసీపీ, లే అవుట్ అనుమతి, నాలా కన్వర్షన్ లేవని తెలిపారు. ఇందులో హోటల్, స్విమ్మింగ్ ఫూల్, టెంపుల్స్, హార్స్ రైడింగ్, షూటింగ్ స్పాట్, చిల్డ్రన్ పార్క్ పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారని వివరించారు. ఇందులో భూమి కొనుగోలు చేసి సామాన్య ప్రజలు మోసపోవద్దని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed