మహిళా వర్సిటీ ఇంచార్జ్ వీసీ బాధ్యతలు చేపట్టిన విజ్ఞులత

by Javid Pasha |
మహిళా వర్సిటీ ఇంచార్జ్ వీసీ బాధ్యతలు చేపట్టిన విజ్ఞులత
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయం మొదటి ఇంచార్జ్ ఉపకులపతిగా ఆచార్య ఎం. విజ్ఞులత బాధ్యతలు చేపట్టారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ సమక్షంలో సోమవారం ఆచార్య విజ్ఞులత కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో విధుల్లో చేరారు. ప్రతిష్టాత్మక మహిళా విశ్వ విద్యాలయానికి సీనియర్ ప్రొఫెసర్, దళిత మహిళకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఆచార్య లింబాద్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాథమిక విద్య నుంచే బాలికల విద్యకు కేసీఆర్ పెద్ద పీట వేశారని అన్నారు. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు బాలికలకు ఆశ్రమ విద్య అందుబాటులోకి రావడంతో ఉన్నత విద్యలో దేశ సగటు 27 ను దాటి తెలంగాణ 40 శాతంగా నమోదైందని వివరించారు.

ప్రొఫెసర్ విజ్ఞులత నేతృత్వంలో మహిళా విశ్వవిద్యాలయం అన్ని విధాలుగా పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించి తనపై బాధ్యతను మోపారని ఆచార్య విజ్ఞులత అన్నారు. తనపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బాధ్యతను, నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. మరింత కష్టపడి పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, వర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed