స్క్రాప్​ వ్యాపారి​ హత్య కేసులో నిందితుడి అరెస్ట్​

by Kalyani |
స్క్రాప్​ వ్యాపారి​ హత్య కేసులో నిందితుడి అరెస్ట్​
X

దిశ, చార్మినార్​ : తన భార్యతో ఫోన్​లో ఎందుకు మాట్లాడతున్నావని అడిగిన స్క్రాప్ వ్యాపారిని కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చిన నిందితుడిని ఫలక్​నుమా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆదివారం రిమాండ్​కు తరలించారు. ఫలక్ నుమా డివిజన్​ ఏసీపీ ఎం.ఎ జావిద్​, ఫలక్​నుమా ఇన్​స్పెక్టర్​ కె.ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ... ఫాతిమా నగర్​ అమ్జదుల్లాబాగ్​ ప్రాంతానికి చెందిన మొహమ్మద్​ సాజిద్​ (37) స్క్రాప్​ వ్యాపారి. ఇతనికి భార్య ,ముగ్గురు పిల్లలు ఉన్నారు. వట్టే పల్లి ఫాతిమా నగర్​ ప్రాంతానికి చెందిన మొహమ్మద్​ సిద్దిక్​ (22) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. మూడు సంవత్సరాల క్రితం మొహ్మద్​ సాజిద్​, మొహమ్మద్​ సిద్దిక్​ లు స్థానికంగా ఉండేవారు. సాజిద్​ భార్యతో మొహమ్మద్​ సిద్దిక్​ ఫోన్​లో మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలోనే సంవత్సరం క్రితం సాజిద్​, సిద్దిక్​ ల మధ్య వివాదం తలెత్తింది.

వారి మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరుకోవడంతో పెద్దల సమక్షంలో ఇద్దరిని పిలిచి రాజీ కుదిర్చారు. సాజిద్​ తన భార్యపై అనుమానం పెంచుకోవడంతో పాటు 10 రోజుల క్రితం భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె తన సోదరుడు సబ్రామ్​ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె కోసం సిద్దిక్​ అక్కడికి కూడా వెళ్లడం ప్రారంభించాడు. దీంతో సబ్రామ్​ ఈ విషయం పై మాట్లాడుదామని ఈ నెల 9వ తేదీన సాయంత్రం సిద్దిక్​ ను పిలిచాడు. కాసేపటికే సాజిద్​ కూడా అక్కడికి చేరుకున్నాడు. దీంతో మరోసారి వారి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. కోపోద్రిక్తుడైన సిద్దిక్​ వెంట తెచ్చుకున్న కత్తితో సాజిద్​పై విచక్షణారహితంగా దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన సాజిద్​ అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో షేక్​ అర్బాజ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్​నుమా పోలీసులు కేసు నమోదు చేసుకుని అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న సిద్దిక్​ను అదుపులోకి తీసుకుని ఆదివారం రిమాండ్​కు తరలించారు.ఈ కేసును ఫలక్​నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story