తెలంగాణలో నిరుద్యోగులు @ 37 లక్షలు

by Javid Pasha |   ( Updated:2023-05-14 11:08:39.0  )
తెలంగాణలో నిరుద్యోగులు @ 37 లక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య ఏటికేడూ పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 37 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేని వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ఇంటికో ఉద్యోగం అన్న హామీ అటకెక్కింది. నిరుద్యోగ భృతి అందడం లేదు. వెరసి ఈ అంశాలు విపక్షాలకు కలిసొచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు నిరుద్యోగుల అంశాన్ని రాజకీయ అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి. నిరుద్యోగ మార్చ్ తో బీజేపీ, యూత్ డిక్లరేషన్ తో కాంగ్రెస్ దూసుకుపోతోంది. వైఎస్సార్టీపీ, తెలంగాణ జన సమితి, బీఎస్పీ లాంటి చిన్న పార్టీలు సైతం ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాయి.

9 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది మాత్రం 46వేలు మాత్రమే అని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగావకాశాలను ప్రభుత్వం కల్పించలేకపోతోంది. డిగ్రీలు పూర్తి చేసిన 33.90 లక్షలమంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ప్రభుత్వ వెబ్ సైట్ లోనే స్పష్టం చేస్తుంది. ఓకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు సుమారు 3 లక్షలకు పైగా ఉన్నారని సమాచారం. గత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో నిరుద్యోగ సగటు 2.2 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు. గతేడాది జనవరి నాటికి 7.7శాతంగా ఉన్న నిరుద్యోగం 2022 డిసెంబర్ నాటికి 9.9శాతంగా నమోదైంది.

గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ..

ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 34 శాతంగా ఉంది. ఈ విషయంలో తెలంగాణ కంటే ఏపీ సహా 13 రాష్ట్రాలలో నిరుద్యోగ రేటు తక్కువ. తెలంగాణలో పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి నిరుద్యోగ రేటు 65 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. అంతకుముందు ఏడాది(2019-20) 97 శాతంతో పోల్చితే ఇధి తక్కువగా ఉంది. తెలంగాణ కంటే 16 రాష్ట్రాలల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది.

పెరుగుతున్న ఆత్మహత్యలు

ఇదిలా ఉండగా 2014 నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 96 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, వీరిలో బడుగులు, బలహీన వర్గాలకు చెందినవారేనని నిరుద్యోగ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. ఈ ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలేనని మండిపడుతున్నారు. అదే విధంగా ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంలో భాగంగా 40విభాగాల్లోని 5545 మందిని రెగ్యులరైజేషన్ చేయడంలో నిరుద్యోగులు మండిపడుతున్నారు.

ప్రతిపక్షాలకు ప్రధాన అంశంగా..

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలకు నియామకాలు నిరుద్యోగ సమస్యనే ప్రధాన అజెండాగా మలుచుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా ప్రతిపక్షాలు సైతం ఇదే అంశంలో ప్రభుత్వంపై పోరాడుతున్నాయి. బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ నెల 8న సరూర్ నగర్ లో నిర్వహించిన యువసంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే.. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబరు 17లోపు నియామకాలు పూర్తి చేయడం, సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజస్ర్టేషన్ పోర్టల్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75శాతం ఉద్యోగాలు.. ఇలా వివిధ అంశాలతో డిక్లరేషన్ ప్రకటించింది.

అమలుకు నోచని ప్రభుత్వ హామీ

2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నిరుద్యోగులకు భృతి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నిరుద్యోగికి రూ.3016 ఇస్తామని ప్రకటించారు. దానికి తగ్గట్టుగా అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో 1810 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. కానీ నిరుద్యోగుల ఎంపికలో ప్రభుత్వం జాప్యం చేసింది. ఈ హామీ అమలుకు నోచుకోవడం లేదు.

Also Read..

ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరు: మంత్రి హరీశ్ రావు

Advertisement

Next Story

Most Viewed