ప్రేమ కోసమా.. ఉగ్రవాద శిక్షణ కోసమా..?

by GSrikanth |   ( Updated:2023-10-10 17:00:10.0  )
ప్రేమ కోసమా.. ఉగ్రవాద శిక్షణ కోసమా..?
X

దిశ, కల్వకుర్తి: గత 20 రోజుల నుండి కనిపించకుండా పోయిన యువకుని అదృశ్యం వెనుక అరాచక శక్తుల ప్రమేయం ఉందన్న అంశం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తి పట్టణంలో నివాసం ఉంటున్న భాస్కరాచారి దంపతులకు కుమారుడు శివ రామాచారి(21), మరో కూతురు ఉన్నారు. శివ రామాచారి గత ఎనిమిదేళ్ల క్రితమే చదువు మానేసి స్థానికంగా గుడ్ల వ్యాపారం చేస్తున్న ఓ ముస్లిం వ్యక్తి దగ్గర పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శివ రామాచారి ఓ ముస్లిం యువతిని ప్రేమించినట్లు సమాచారం. ఈ క్రమంలో శివ రామాచారికి స్నేహితులైన ముస్లిం యువకుల సలహాల వల్లనో.. లేక ఆ యువతిని దక్కించుకోవాలంటే... తాను ముస్లింగా మారాలన్న ఆలోచనతోనో ముస్లిమ్ స్నేహితులతో కలిసి మజీదులకు వెళ్లి ప్రార్థనలు చేయడం.. ఖురాన్ నేర్చుకోవడం వంటివి చేస్తూ వచ్చాడు. వేషధారణ సైతం ఇస్లాం భావజాలాన్ని కల్పించేలా మార్చుకున్నాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఇంటికి రాకుండా ముస్లిం స్నేహితుల వద్దే ఉండేవాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో డిసెంబర్ 8వ తేదీ నుండి తమ కుమారుడు శివ రామాచారి కనిపించడం లేదని.. కొంతమంది ఇక్కడి నుండి ఉగ్రవాద శిక్షణా కేంద్రాలకు తరలించారని ఆరోపిస్తూ గత సంవత్సరం డిసెంబర్ 31న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు శివ రామాచారితో సన్నిహితంగా ఉండే వ్యక్తులను పిలిపించి విచారణ చేశారు. దీంతో వారు వెంటనే విజయవాడలో ఉన్న శివ రామాచారిని కల్వకుర్తికి పిలిపించి పోలీసులకు అప్పగించారు. అనంతరం శివ రామాచారిని పోలీసులు ప్రశ్నించడగా.. 'తనను విజయవాడకు ఎవరు బలవంతంగా తీసుకెళ్లలేదు. నేనే వెళ్లాను. ముస్లిం యువతిని చిన్నప్పటినుండి ప్రేమించాను. నా ఇష్టం పూర్తిగానే మతం మార్చుకో దలుచుకున్నాను.' అని శివరామాచారి పోలీసులకు సమాధానం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఎవరి ప్రమేయం లేకుంటే.. విజయవాడలో ఎవరితో ఉన్నాడు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగానే అంతవరకు తమకు తెలియదు అన్నవారే శివను పిలిపించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. సోమవారం కల్వకుర్తి పోలీసులు శివకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. పోలీసులు కొంతమందిని విచారించగా శివకు సంబంధించిన విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదు అని చెప్పినట్లు సమాచారం. కాగా లవ్ జిహాద్‌లో భాగంగానే ఈ తతంగం నడుస్తుందని మరి కొంతమంది అంటున్నారు.


Advertisement

Next Story