మాజీ స్పీకర్ పోచారంనకు బిగ్ షాక్.. కుమారుడు భాస్కర్ రెడ్డి పదవి ఊస్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-03-21 07:38:45.0  )
మాజీ స్పీకర్ పోచారంనకు బిగ్ షాక్.. కుమారుడు భాస్కర్ రెడ్డి పదవి ఊస్ట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని పోచారం భాస్కర్ రెడ్డి కోల్పోయారు. గురువారం పాలకవర్గం పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో పోచారం భాస్కర్ రెడ్డి కీ వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనడంతో ఆయన పదవి కోల్పోయారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పై పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి డీసీవోకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం సమావేశం నిర్వహించారు.

అయితే మెజార్టీ సభ్యులు తనకు వ్యతిరేకంగా ఉండడంతో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. సంబంధిత లేఖను సహకార శాఖ కమిషనర్‌కు పంపించారు. అయితే పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామాలు కమిషనర్ ఆమోదించలేదు. సంబంధిత చైర్మన్ నేరుగా తన రాజీనామా లేఖను ఇవ్వకపోవడంతో రాజీనామాలు ఆమోదించలేదని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో భాస్కర్ రెడ్డి‌పై అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించారు. దానికి డిసిసిబి వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ సభ్యులందరూ క్యాంపు నుంచి నేరుగా సమావేశ మందిరానికి హాజరయ్యారు.

21 మంది పాలకవర్గ సభ్యులగాను 17 మంది హాజరయ్యారు. అందులో 16 మంది పోచారం భాస్కర్ రెడ్డి పై వ్యతిరేకంగా చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. దానితో డిసిఒ శ్రీనివాస్ పోచారం భాస్కర్ రెడ్డి పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రకటించారు. సహకార చట్టాలను అనుసరించి చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న చైర్మన్ స్థానంలో ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న కుంట రమేష్ రెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్త డిసిసిబి చైర్మన్ ఎంపిక విషయంపై సహకార శాఖ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నాలుగు సంవత్సరాలు పదవి బాధ్యతలు నిర్వహించిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి గద్దె దిగారు. పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎదుట రమేష్ రెడ్డి అనుచరులు సంబరాలు నిర్వహించారు.

Advertisement

Next Story