‘మంత్రి పదవి ఇస్తేనే.. పార్టీలో చేరుతా’.. కాంగ్రెస్‌లో చేరికపై ఓ BRS మాజీ మంత్రి కండిషన్

by Satheesh |
‘మంత్రి పదవి ఇస్తేనే.. పార్టీలో చేరుతా’.. కాంగ్రెస్‌లో చేరికపై ఓ BRS మాజీ మంత్రి కండిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘కాంగ్రెస్‌లో చేరుతా, కానీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి’ అని షరతు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ పదవి దక్కించుకునేందుకు ఇండియా కూటమికి చెందిన లీడర్ల ద్వారా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది. దీనితో సదరు లీడర్‌ను పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ లీడర్ల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు టాక్ ఉంది. అయితే ఆ ఎమ్మెల్యేపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పీసీసీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.

నెలరోజులుగా లాబీయింగ్

ఈ మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతుండగా, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు మానసికంగా సిద్ధం అయ్యారు. అయితే ఉన్నఫళంగా పార్టీ మారితే కాంగ్రెస్‌లో ప్రయారిటీ ఉండదనే ఉద్దేశంతో సదరు ఎమ్మెల్యే ఇండియా కూటమికి చెందిన ఓ మాజీ సీఎం ద్వారా లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆ మాజీ సీఎం రాహుల్‌గాంధీ వద్ద ప్రస్తావించి, సదరు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరుగుతున్నది.

వెంటాడుతోన్న అవినీతి ఆరోపణలు

ఆ గులాబీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని పీసీసీ హైకమాండ్‌కు ఓ రిపోర్టు పంపినట్టు సమాచారం. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సదరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు, ప్రస్తుతం జరుగుతోన్న విచారణలను ఆందులో పేర్కొన్నట్టు తెలిసింది. పార్టీలో చేర్చుకోవడం వరకు ఎలాంటి ఇబ్బంది లేదని, కాని మంత్రి పదవి ఇవ్వడం కష్టమని క్లారిటీ ఇచ్చినట్టు టాక్ ఉంది.

మంత్రి పదవి కోసం తీవ్రపోటీ

మంత్రి పదవి కోసం పార్టీ మారుతోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. అయితే, కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కుతాయని గతంలోనే సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అయినా ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఎవరికివారే మినిస్టర్ పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏఐసీసీలో తమకు ఉన్న పాత పరిచయాల ద్వారా కొందరు లాబీయింగ్ చేస్తుండగా, ఇంకొందరు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంల ద్వారా పైరవీలు చేస్తుండటం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed