డ్రమ్ములో లభ్యమయిన డెడ్ బాడీ.. వివాహితతో లవ్ ఎఫైర్ కారణమా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-28 03:23:48.0  )
డ్రమ్ములో లభ్యమయిన డెడ్ బాడీ.. వివాహితతో లవ్ ఎఫైర్ కారణమా?
X

దిశ, బడంగ్​పేట్​ : సూరం చెరువులో ఓ డ్రమ్ములో 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో పహాడీషరీఫ్ పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్ళికి మునుపే పురన్​సింగ్​కు యూపీకి చెందిన మరో వివాహితతో లవ్​ ఎఫైర్​ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు వివాహిత భర్త, పిల్లలను వదిలి హైదారాబాద్​కు రావడంతో ఆమె అత్తింటి వాళ్లు పురన్​సింగ్​ను చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలలోకి వెళితే ...

సంచలనం సృష్టించిన సూరం చెరువు డ్రమ్ములో లభ్యమైన 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఘటనలో మిస్సింగ్​ కేసు ఆధారంగా బండ్లగూడ పటేల్​ నగర్​కు చెందిన పురన్​ సింగ్​ (30) గా పహాడిషరీఫ్ పోలీసులు గుర్తించారు. ఉత్తర్​ ప్రదేశ్​ ఉరయ్ ​గ్రామానికి చెందిన పురన్​సింగ్‌కు ఘోరక్​పూర్​ వికలాంగురాలు మమతాదేవితో ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్​లోనే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కృష్ణ (4), ప్రవీణ్​కుమార్​‌లు ఉన్నారు.

పురన్​సింగ్​కు ఓ వివాహితతో లవ్​ ఎఫైర్​?

పురన్​సింగ్​కు పెళ్లికి మునుపే అయితే ఉత్తర్​‌ప్రదేశ్‌కు చెందిన ఇది వరకే వివాహం జరిగి, ఇద్దరు పిల్లలు ఉన్న వివాహితతో ప్రేమ వ్యవహారం కొనసాగినట్లు తెలుస్తుంది. అక్కడ పురన్​ సింగ్​ కోసం వివాహిత అత్తింటి వారితో గొడవలు జరిగినట్టు సమాచారం. ఐదేళ్ళ క్రితమే హైదరాబాద్​కు వచ్చిన గప్​చుప్​ల బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న పురన్​సింగ్​కు మమతా దేవితో వివాహం జరిగాక బండ్లగూడ పటేల్​నగర్​లోనే నివసిస్తున్నాడు. పెద్దకుమారుడు కృష్ణ జన్మించాక సదరు వివాహితతో పురన్​సింగ్​కు గొడవలు ప్రారంభమయ్యాయి.

అప్పట్లో యూపీలో స్థానిక పోలీస్​స్టేషన్​లో పురన్​సింగ్​పై సదరు వివాహిత అత్తగారు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉండగా తనను పెళ్ళి చేసుకోమంటే మరో యువతిని ఎలా పెళ్ళి చేసుకుంటావా అని లాక్​ డౌన్​ సమయంలో సదరు యువతి హైదరాబాద్​కు వచ్చి పురన్​సింగ్​తో గొడవకు దిగింది. తన భర్తను, ఇద్దరు పిల్లలను వదిలి వచ్చానని తనను పెళ్ళి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి చేసింది. దీంతో పురన్​సింగ్​ ఇప్పుడు నాకు పెళ్లయిందని, వికలాంగురాలితో వివాహం జరిగిందని, తనను వదిలేయాలని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. అనంతరం వీరిమధ్య జరిగిన ఒప్పందంలో సదరు వివాహిత కూడా అప్పటి నుంచి కాటేదాన్​ ప్రాంతంలోనే ఓ గది అద్దెకు దిగి ఇక్కడే నివసిస్తున్నట్లు సమాచారం.

నా కొడుకు సంసారంలో నిప్పులు పోస్తావా? నిన్ను బ్రతకనీయమని గత కొన్ని రోజులుగా సదరు వివాహిత అత్తగారు పురన్​సింగ్​ను హెచ్చరించడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలోనే పురన్​సింగ్​ ఈ నెల22వ తేదీన కనిపించకుండా పోయాడు. పురన్​సింగ్​ ఈ నెల 25వ తేదీన తుక్కుగూడలోని సూరం చెరువులో ఓ డ్రమ్ములో తలక్రిందులుగా తరహాలో మృతదేహం లభ్యమయ్యింది. కేసును నమోదు చేసుకున్న పహాడీషరీఫ్​ పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పురన్​సింగ్​ హత్య సదరు వివాహిత అత్తగారే చేశారా? ఇంకా ఎవరైనా చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పురన్​సింగ్​ను ఎప్పుడు? ఎక్కడ ?ఎలా? ఎవరు? హత్య చేశారు? అనే అంశాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Advertisement

Next Story