జీవో నెం 317 బాధితులకు గుడ్ న్యూస్.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం

by Satheesh |
జీవో నెం 317 బాధితులకు గుడ్ న్యూస్.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత రెండున్నరేళ్ళుగా జీవో 317 అమలుతో పడుతున్న ఇబ్బందులను లోతుగా చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ పలు రూపాల్లో వెసులుబాటు, రిలీఫ్ కల్పించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలో స్థానికత అంశం కీలకం కావడంతో వారి గ్రీవెన్స్‌కు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నది. భార్యా భర్తలు రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నట్లయితే ఇద్దరూ ఒకే చోట ఉండేలా స్థానికత, బదిలీ తదితర అంశాల్లో మానవీయ దృక్పథంతో వ్యవహరించేలా ప్రత్యేకంగా వారి కోసం మరో ఆప్షన్‌ను కల్పించాలని అధికారులకు సూచించింది. మల్టిపుల్ అప్లికేషన్లను కూడా సమర్పించేందుకు వెసులుబాటు ఇచ్చింది. మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో బుధవారం సమావేశమై కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నది.

జీవో 371 బాధితులు వారి గ్రీవెన్స్ తెలియజేయడానికి ప్రభుత్వం (సాధారణ పరిపాలన శాఖ) ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవడంతో ఇప్పటివరకు 12 వేల దరఖాస్తులు వచ్చినట్లు సబ్ కమిటీకి అధికారులు వివరించారు. జీవో 317లోని అంశాలు, దాన్ని అమలు చేసే క్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత, వారు సూచిస్తున్న ప్రతిపాదనలు, జీవోలో చేయాల్సిన మార్పులు తదితరాలన్నింటినీ కేబినెట్ సబ్ కమిటీ లోతుగా చర్చించింది. కొత్తగా కల్పించిన వెసులుబాటుకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొత్తగా దరఖాస్తులను ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు సమర్పించవచ్చని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులను సమర్పించాల్సి ఉన్నందున ప్రతీ ఒక్కరికీ ఒక రిసిప్ట్ అందుతుందని, రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌కు ఒక మెసేజ్ కూడా వస్తుందని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed