- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అత్యాశకుపోయి అమాయకులు బలి.. రూ.15 లక్షలకు 30 లక్షలిస్తాం అంటూ మోసం
దిశ, తెలంగాణ బ్యూరో : ‘రూ.15 లక్షలు పెట్టండి. రెండు నెలల్లోనే డబుల్ చేసిస్తాం. రూ.30 లక్షలు మీ చేతిలో పెడతాం. అడ్వాన్స్ చెక్కులు, ప్రామిసరీ నోట్, బాండ్ పేపరు రాసిస్తాం. నమ్మకం లేదా? అయితే నాలుగు నెలల్లో డబుల్ చేస్తాం. దానికి గాను గుంట భూమిని రిజిస్ట్రేషన్ చేసిస్తాం. అమౌంట్ ఇవ్వగానే మా భూమి మాకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయండి. చాలా పెద్ద కంపెనీ ఇది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోనూ ఆఫీసులు ఉన్నాయి. కంపెనీ మీద నమ్మకం లేకపోతే చెప్పండి. రెండు నెలల్లో 50 శాతం అదనంగా ఇస్తాం. దానికి మా సొంత చెక్కులు ఇస్తాం. ఇది అందరికీ కాదు. మమ్మల్ని నమ్మినోళ్లకే. విశ్వాసముంటేనే పెట్టుబడి పెట్టండి.’ అంటూ అమాయక జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. రెండు నెలల్లోనే డబుల్ అవుతాయంటే చాలా మంది పెట్టబడులు పెడుతున్నారు. ఇందులో ప్రభుత్వ టీచర్లు, ప్రైవేటు ఉద్యోగులు, రైతులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇలా అనేక రంగాలకు చెందిన వారున్నారు. అక్కడి మేనేజర్లు, మధ్యవర్తుల వివరాల ప్రకారం ఈ కంపెనీ 15 రోజుల్లోనే రూ.25 కోట్లు కలెక్షన్ చేసింది. సాగర్ రింగ్ రోడ్డు (హైదరాబాద్)కు దగ్గరే వెలసిన ఆఫీసులో అత్యంత గోప్యంగా ఈ దందా సాగుతున్నది. అయితే అదెలా సాధ్యమని ప్రశ్నించేవాళ్లకు మాత్రం స్కీంలో చోటు లేదు.
తాకట్టు పెట్టి.. వడ్డీకి తెచ్చి..
చాలా మంది బంగారాన్ని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి వచ్చిన సొమ్మును ఈ కంపెనీలో పెట్టినట్లు తెలిసింది. ఇంకొందరైతే బంధుమిత్రుల దగ్గర వడ్డీకి తెచ్చారు. మరికొందరేమో తన వాళ్లందరితో రెట్టింపు డబ్బులొస్తాయంటూ నమ్మించారు. జూన్ 11 నుంచి ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నది. రెండు నెలల్లోనే డబుల్ పేమెంట్ స్కీం గురించి తెలుసుకున్న ‘దిశ’ పూర్తి వివరాలను ఆరా తీసింది. ఇదిలాగే కొనసాగితే మొదట్లో కట్టిన కొందరికి డబ్బులిచ్చి.. ఆ తర్వాత మిగతా వారికి చుక్కలు చూపించే ప్రమాదముంది.
రైతులే బలి..
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురం, మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్ల కింద ప్రభుత్వం వేలాది ఎకరాలను సేకరించింది. రైతులకు నష్టపరిహారం ఇచ్చింది. ఆ వచ్చిన సొమ్ముతో పోయిన భూమిలో 25 శాతం కూడా రాదు. దాంతో ఆ వచ్చిన డబ్బులన్నీ ఖాతాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా వీళ్లనే టార్గెట్ చేసుకొని డబుల్ చేసి ఇస్తామంటూ కొందరు రంగంలోకి దిగినట్లు తెలుస్తున్నది. ఇక్కడి స్థానికులనే ఏజెంట్లుగా సెలెక్ట్ చేశారు. వారి మీద నమ్మకంతో చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు క్యూ కడుతున్నారు. ఈ రెండు మండలాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన అనేక మంది ఆశపడ్డారు. టీచర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక మంది పెట్టుబడి పెట్టారు. అయితే రెండు నెలల తర్వాత మొదటి దఫా కట్టిన వారికి డబుల్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ తర్వాత కట్టిన వారికి డబుల్ పేమెంట్ రావడం కష్టమే. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే ఒకరి నుంచి మరొకరు తెలుసుకొని ఈ స్కీంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు.
ఆఫీసులో డబ్బుల కట్టలు
రెండు నెలల్లోనే పెట్టుబడి డబుల్ అవుతుందన్న స్కీం వివరాలు తెలుసుకునేందుకు ‘దిశ’ ప్రయత్నించింది. తొలుత ఏజెంట్ నంబరు తెలుసుకొని వివరాలను అడిగింది. ఆయనేమో స్వయంగా వస్తేనే చెప్తామన్నారు. అంతకు ముందు ఎవరు? ఎక్కడ? ఏం చేస్తుంటారు? నంబరు ఎవరు ఇచ్చారు? బంధుమిత్రులెవరు? ఏ ఊరు? .. ఇలాంటి అనేక వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాతే మాట్లాడేందుకు ఒప్పుకున్నారు. ఆఫీసుకి వెళ్లి తన పేరు చెప్తే స్కీం డిటెయిల్స్ అన్నీ చెప్తారన్నారు. అయితే ఇక్కడ అసలు పేరు కాకుండా మరో పేరు చెప్పాలన్నారు. అంటే ముందుగానే వీరంతా జాగ్రత్త పడుతున్నారని స్పష్టమైంది. ఆఫీసుకి వెళ్లగానే అరగంట సేపు కూర్చోబెట్టారు. డబ్బుల కట్టలు టేబుల్ మీద పోస్తూనే ఉన్నారు. అక్కడ కూర్చున్న వారితో మాట్లాడితే తాము మర్రిగూడ మండలానికి చెందిన వారమని, ఒక్కొక్కరం రూ.15 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టామన్నారు. తమకు తెలిసిన వారితో రూ.కోటికి పైగానే పెట్టించినట్లు వివరించారు. రెండు నెలల్లోనే డబుల్ వస్తున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు.. మీరు కూడా పెట్టండన్నారు. రూ.2, 3 లక్షలు పెడితే వేస్ట్. కనీసం రూ.10, 15 లక్షలు పెడితే బాగుంటుందని నమ్మబలికారు. ఇక పెద్ద సార్ దగ్గరికి తీసుకెళ్లారు. స్కీం వివరాలన్నీ చెప్పారు. రెండు నెలల్లో డబుల్ ఇస్తాం. నమ్మకం లేకపోతే గుంట భూమిని రిజిస్ట్రేషన్ చేసి నాలుగు నెలల్లో ఇస్తాం. తిరిగి కంపెనీకి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ స్కీం నాలుగు నెలల నుంచి ఆర్నెళ్లకు త్వరలో పెంచేస్తాం. మేం అనుకున్న అమౌంట్ వచ్చేసింది. ఇప్పటికే రూ.25 కోట్లు కలెక్ట్ అయింది. ఈ డబ్బులతోనే అనేక రకాల వ్యాపారాలను కొనసాగిస్తాం. లాభాలు వస్తాయి. అందులో నుంచే పెట్టుబడి పెట్టిన వారికి ఇస్తాం. నమ్మకం ఉంటేనే పెట్టండి. కంపెనీని నమ్మకపోతే నన్ను నమ్మండి. నాకే డబ్బులు ఇవ్వండి. నా సొంత చెక్కులు ఇస్తా. అయితే నేనైతే నాలుగు నెలల్లో డబుల్ ఇస్తా అని చెప్పడం గమనార్హం.
వారం రోజుల శోధన
అమాయక జనానికి అత్యాశ చూపించి డబ్బులు ఎగరేసుకుపోతారనే సందేహం లేదు. తొలి రోజుల్లో పెట్టిన వారికి ఇస్తుండొచ్చు. కానీ ఆ తర్వాత కట్టిన వారి గతి ఏం కావాలి? ఒక్కొక్కరు జీవితాన్ని ఫణంగా పెట్టి డబ్బులు తెచ్చి కట్టారు. రూ.లక్షకు రూ.10 వేల కమీషన్ కి కక్కుర్తి పడిన ఏజెంట్లు సొంతూర్లలోనే జనంతో డబ్బులు కట్టించారు. ఇందులో ఓ సర్పంచ్ కూడా రూ.15 లక్షలు కట్టడంతో జనం నమ్ముతున్నారు. ఎప్పుడు దుకాణం సర్దేస్తారో అంతుచిక్కడం లేదు. నాంపల్లి, మర్రిగూడ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు పెట్టుబడి పెట్టారు. వారం రోజులుగా చేపట్టిన శోధన ద్వారా అనేక కోణాలు వెలుగులోకి వచ్చాయి. ‘we are not selling land. just buying it’ అంటూ కొత్త కోణంలో మార్కెట్ ని ఏలేందుకు ఈ పథకాన్ని రూపుదిద్దారు. డబ్బులు కడుతున్నాం. కానీ రెండు నెలల్లో డబుల్ ఎలా అవుతుంది? ఈ కంపెనీ గత చరిత్ర ఏంటి? చైర్మన్ ఎవరు? అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టులేవి? ఎంత వరకు నమ్మొచ్చు? ప్రపంచంలో ఎక్కడైనా అతి తక్కువ కాలంలో రెట్టింపు చేసి ఇచ్చిన స్కీంలు సక్సెస్ అయ్యాయా? మనం ఎవరిని నమ్మి పెడుతున్నాం? ఈ విషయాలను గమనంలోకి తీసుకోకుండానే రూ.లక్షలు పోశారు. పెట్టుబడి పెట్టిన వారికి ఎలా నమ్మిస్తున్నారు? ఈ కంపెనీ చరిత్ర రెండో ఎపిసోడ్ లో చూద్దాం.