గంటలో పెళ్లి.. వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. రాత్రంతా రచ్చరచ్చ!

by sudharani |   ( Updated:2023-03-10 12:00:13.0  )
గంటలో పెళ్లి.. వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. రాత్రంతా రచ్చరచ్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పెళ్లిల్లో గొడవలు సహజం. భోజనాలు సరిగా వడ్డించలేదనో, బంధువులను పట్టించుకోలేదనో ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవలకు దిగుతుంటారు కొందరు. అయినా ఏదో ఒకటి సర్ధి చెప్పి వివాహ తంతు ముగిస్తారు. కానీ.. కొంత మంది మాత్రం కట్నాల విషయంలో గొడవ పడి కొన్ని సందర్భాల్లో పెళ్లి వద్దని క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోవడం చూస్తుంటాం. అయితే.. తెలంగాణలో మాత్రం ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఇచ్చిన కట్నం సరిపోలేదని.. తనకు అదనపు కట్నం కావాలంటూ వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఘట్కేసర్‌లోని పోచారం మున్నిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. అబ్బాయి తరుఫు వారు వధువుకు రెండు లక్షల ఎదురు కట్నం ఇస్తామని పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. దీంతో గురువారం రాత్రి వివాహానికి ముహూర్తం కూడా నిశ్చయమైంది. రాత్రి 7 గంటల 21 నిమిషాలకు పెళ్లి ఉందనగా.. అబ్బాయి తరుపు బంధువులందరూ మండపానికి చేరుకున్నారు. కానీ వధువుకు సంబంధించిన వారు రాలేదు. దీంతో టెన్షన్ పడ్డ మగపెళ్లి వారు ఏం జరిగిందని ఆరా తీశారు.

వధువుకు అబ్బాయి తరుపు వారు ఇచ్చిన ఎదురు కట్నం సరిపోలేదట. అదనపు కట్నం కావాలంటూ ఓ గంటలో వివాహం జరుగుతుందనగా పెళ్లి వద్దని క్యాన్సిల్ చేసింది. ఇక చేసేదేమీ లేక మగపెళ్లి వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ ఎదుటనే ఇరు వర్గాలు వాగ్వాదం చేసుకున్నారు. పోలీసులు సైతం ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వరుడు కుటుంబ సభ్యులు ముందు ఇచ్చిన రెండు లక్షల కట్నం కూడా వదులుకుని వెళ్లిపోయారు.

Advertisement

Next Story