బిగ్ న్యూస్: నెల రోజుల తర్వాత నిజమైన ప్రధాని మోడీ అంచనాలు.. ఒక్కటైన ఎనిమిది పార్టీలు!

by Satheesh |   ( Updated:2023-03-06 06:40:05.0  )
బిగ్ న్యూస్: నెల రోజుల తర్వాత నిజమైన ప్రధాని మోడీ అంచనాలు.. ఒక్కటైన ఎనిమిది పార్టీలు!
X

“ఓటర్లు చేయలేని పనిని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేసింది. ప్రతిపక్షాలను ఏకం చేసింది. అందుకు ఈడీకి ఆ పార్టీల నేతలు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. బీజేపీయేతర పార్టీలను ఈడీ అవినీతి కేసుల్లో వేధిస్తున్నదంటూ ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయి”.

– ఫిబ్రవరి 8న లోక్‌సభలో ప్రధాని మోడీ.

“ప్రతిపక్ష నేతలపై కేంద్ర సంస్థల దుర్వినియోగం పెరిగింది. అవి నమోదు చేసిన కేసులు, అరెస్టులు విపక్ష నాయకులపైనే. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయ కుట్రతో కూడినవి”. – ఈ

నెల 5న ప్రధానికి రాసిన లేఖలో విపక్ష నేతలు

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘ సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను విపక్ష పార్టీలపైకే కేంద్రం ఉసిగొల్పుతున్నది.. అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా ఎనిమిది పార్టీలకు చెందిన తొమ్మిది మంది ఆదివారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇలాంటి పరిణామం తలెత్తుతుందని ప్రధాని మోడీ నెల రోజుల ముందే ఊహించారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా గత నెల 8న ప్రధాని లోక్‌సభలో మాట్లడిందే.. ఇప్పుడు నిజమైంది. కేసీఆర్‌తో పాటు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ఫరూఖ్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్ పేర్లతో ఆ లేఖ వెలుగులోకి వచ్చింది.

కానీ.. కేసీఆర్‌తో పలు సందర్భాల్లో మద్దతుగా నిలిచిన స్టాలిన్, తిరుమావలవన్, కుమారస్వామి, హేమంత్ సోరేన్, నితీష్ కుమార్ లాంటి పలువురు దూరంగానే ఉన్నారు. లేఖపై సంతకాలు చేయకున్నా ఆమోదం తెలిపిన వారిలో కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్, మమతాబెనర్జీ సీఎంలు.. మిగిలిన వారు మాజీ సీఎంలు. సీఎంలు మినహా మిగతావారంతా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉండేవారే కాకుండా.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొత్తులో ఉన్నారు.

వీరంతా సీబీఐ, ఈడీ నుంచి వేర్వేరు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. చివరికి ఆ రెండు సంస్థలకు వ్యతిరేకంగా వీరంతా ఒక్కటయ్యారు. గతంలో యంగ్ ఇండియా (నేషనల్ హెరాల్డ్) ఫండ్స్ వ్యవహారంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. కానీ.. ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఎనిమిది పార్టీల నేతలు రాసిన లేఖకు వీరు దూరంగా ఉండిపోవడం విశేషం.

బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం తప్పదంటూ హెచ్చరించే కమ్యూనిస్టు పార్టీలు వీరితో జతకట్టలేదు. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదంటూ సీపీఐ, సీపీఎం నేతలు పలు సందర్భాల్లో ఆరోపించారు. గౌతమ్ అదానీ ఇష్యూలోనూ పార్లమెంటులో ప్రభుత్వంపై గట్టిగానే కొట్లాడి.. సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. లేఖపై అంటీముట్టనట్లుగానే ఉండిపోయారు.

కవిత అరెస్ట్ అంటూ వార్తలు వస్తుండగా..

కాంగ్రెస్ లేని విపక్ష పార్టీల ఐక్యతకు అర్థమే లేదని వ్యాఖ్యానించిన జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా లేఖ రాసిన వారిలో ఒకరు. బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్‌తో జతకట్టిన బీహార్ సీఎం నితీష్ సైతం దూరంగానే ఉండిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. ఆ తర్వాత వంతు కవితదేనంటూ జాతీయస్థాయిలోనే వార్తలు వస్తుండగా ప్రస్తుతం లేఖ రాయడం గమనార్హం.

కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంగా బీఆర్ఎస్ జాతీయస్థాయికి విస్తరించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారు. అందుకే.. ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలకు చేరువై.. కలిసి చర్చలు జరిపారు. కాంగ్రెస్‌తో కలిసి పొత్తులో ఉన్న డీఎంకే, విడుదలై చిరుత్తైగళ్ కట్చి, జార్ఖండ్ ముక్తిమోర్చా, ఆర్జేడీ, ఎన్సీపీ, శివసేన(థాక్రేవర్గం)పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ , బీఎస్పీ కూడా లేఖతో సంబంధం లేకుండా ఉండిపోయారు.

కేసులెదుర్కొంటున్న వారే..

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోపు పార్టీల మధ్య ఐక్యత ఎలా ఉన్నా సీబీఐ, ఈడీలకు వ్యతిరేకంగా మాత్రం ఎనిమిది పార్టీలు ఒక్కటయ్యాయి. కేసులు, విచారణలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలు వీటితో కలిసి రాకపోవడం గమనార్హం. ప్రధాని రేసులో ఉన్నట్లు చెప్పుకునే నితీష్ , అన్ని అర్హతలూ ఉన్నాయని ప్రశంసలు పొందిన స్టాలిన్ లేఖపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ లేఖకు మద్దతు పలికిన పార్టీల నేతల్లో కొద్దిమందిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. ఒక దఫా దర్యాప్తు కూడా పూర్తిచేశాయి. ఇకపైన ముమ్మరం అవుతుందనే అనుమానాలూ లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానిపై ఒత్తిడి పెంచడానికి, పరోక్షంగా తాత్కాలికంగా బ్రేక్ వేయడానికి ఒక ‘ప్రెషర్ గ్రూపు’గా ఏర్పడ్డాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ప్రధానిపైనే విమర్శలు చేసి మళ్లీ ఆయనకే లేఖ రాయడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలూ వస్తున్నాయి.

ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.. కేసీఆర్‌ సహా 9 మంది నేతల సంతకాలు

దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని.. ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రతిపక్షాలే టార్గెట్‌గా కేంద్ర సంస్థలు పని చేస్తున్నాయని ఆరోపించారు. గవర్నర్లు ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ఆదివారం నలుగురు ముఖ్యమంత్రులు, పలువురు విపక్ష నేతలు ప్రధానికి లేఖ రాశారు. ఈ లేఖపై కేసీఆర్, మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, తేజస్వీయాదవ్, ఫరుక్ అబ్దుల్లా, శరద్ పవార్, ఉద్దవ్ థాక్రే, అఖిలేష్ యాదవ్ సంతకాలు చేశారు.

లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఆరోపించిన అక్రమాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకున్నా పక్కా టార్గెట్‌తోనే సిసోడియాను అరెస్టు చేశారని ఆరోపించారు. బీజేపీ నిరంకుశ పాలనలో దేశ ప్రజాస్వామ్య విలువలను ప్రపంచం అనుమానిస్తుందని పేర్కొన్నారు. అదానీ-హిండెన్​బర్గ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్, పంజాబ్, తెలంగాణ వంటి బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కావాలనే పాలనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రధానికి విపక్ష నేతలు రాసిన లేఖ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.


ఇవి కూడా చదవండి :

తెలంగాణ మహిళ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్

Advertisement

Next Story

Most Viewed