North Korea: భారీ విధ్వంసానికి రెడీ అయిన కిమ్..!

by Shamantha N |
North Korea: భారీ విధ్వంసానికి రెడీ అయిన కిమ్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరకొరియా(North Korea) అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong un) భారీ విధ్వంసానికి రెడీ అయ్యారు. భారీ మొత్తంలో ఆత్మాహుతి డ్రోన్లను(Suicide Attack Drones) తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రష్యా సేనలతో కలిసి ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి ప్యాంగ్యాంగ్‌ సైన్యం చేరింది. ఇలాంటి సమయంలో కిమ్ ఆదేశాలు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇటీవలే, కిమ్‌ ఓ ఆత్మాహుతి డ్రోన్‌ పరీక్షలో నేరుగా పాల్గొన్నారు. భూఉపరితలంపై, సముద్రంలోని లక్ష్యాలను ఆ డ్రోన్‌ ఛేదించింది. ఆ ఆతర్వాతే సూసైడ్‌ డ్రోన్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ‘‘వీలైనంత వేగంగా డ్రోన్ల ఉత్పత్తిని మొదలుపెట్టాలని కిమ్ ఆదేశించారు’’ అని కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ కథనంలో పేర్కొంది.

సూసైడ్ డ్రోన్లు

అత్యంత తేలిగ్గా వాడే పవర్ ఫుల్ ఆయుధమే సూసైడ్ డ్రోన్స్ అని కిమ్‌ అభివర్ణించారని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో ఉత్తరకొరియా తొలిసారి సూసైడ్ డ్రోన్లను ప్రదర్శించింది. రష్యాతో(Russia) సత్సంబంధాలు ఏర్పడ్డాక సంపాదించిన టెక్నాలజీతో వాటిని ఉత్తరకొరియా నిర్మించినట్లు తెలుస్తోంది. 2022లో కూడా కిమ్‌ సేనలు చిన్నచిన్న డ్రోన్ల దండును దక్షిణ కొరియా సరిహద్దులకు తరలించాయి. ఉత్తర కొరియా ఈ ఏడాది ఆగస్టులో పరీక్షించిన డ్రోన్లు ఇజ్రాయెల్‌కు చెందిన హరోప్‌, హీరో-30, రష్యాలోని లాన్సెట్‌-3లను పోలి ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లో ఇరాన్‌ హ్యాకింగ్‌కు పాల్పడి ఈ సాంకేతికతను చోరీ చేసి మాస్కో చేతికి అప్పజెప్పి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. కిమ్‌ సైన్యం ఈ టెక్నాలజీ రష్యా నుంచి సంపాదించి ఉండొచ్చని భావిస్తున్నారు.

Next Story