ఓసీ, ఎస్సీ, ఎస్టీ.. ఏఐసీసీ ఎంపికలో కులాల లెక్కలు..!

by karthikeya |
ఓసీ, ఎస్సీ, ఎస్టీ.. ఏఐసీసీ ఎంపికలో కులాల లెక్కలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ లీడర్లకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ సూచనల మేరకే వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను ఎంపిక చేసే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్స్ అపాయింట్‌మెంట్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఏ సామాజిక వర్గం నుంచి ఎవరిని నియమించాలనే అంశంపై ప్రాథమిక కసరత్తు జరిగిందనే టాక్ ఉంది.

బలరాం నాయక్, వంశీచంద్‌రెడ్డి ఫైనల్?

వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎంపిక విషయంలో ప్రాథమికంగా ఖర్గేతో చర్చించిన సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, త్వరలో రాహుల్‌గాంధీతో డిస్కషన్ చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. మంత్రివర్గ విస్తరణకు ముందర అటు ఇటుగా వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను ప్రకటించే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నది. పీసీసీ కార్యవర్గం కూర్పులో సామాజిక సమతుల్యత పాటించాలనే ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం బీసీ వర్గం నేతకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా ఓసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని భావిస్తున్నది. ఎస్టీ వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తున్నది. ఓసీ వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌‌‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏఐసీసీ లీడర్లు వంశీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఒకవేళ ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తే, పార్టీ వ్యవహారాల బాధ్యతలనూ అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఎస్సీ లీడర్ కోసం అన్వేషణ

ఏఐసీసీ సెక్రెటరీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకునేందుకు సుముఖంగా ఉంటారా? అని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎస్సీ వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన లక్ష్మణ్, వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో పాటు మరో ఐదారుగురు లీడర్ల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు ప్రచారం ఉంది.

జగ్గారెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు!

ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌కు ఏఐసీసీ‌లో స్పోక్స్ పర్సన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తున్నది. అయితే, ఆ పదవిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నియమించాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఆయనకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించేందుకు సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి సైతం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed