ఉస్మానియా యూనివర్సిటీలో రూ.25 కోట్ల కుంభకోణం.. విషయం బయటకు పొక్కినా కేసు అవ్వకుండా అడ్డగింత

by Gantepaka Srikanth |
ఉస్మానియా యూనివర్సిటీలో రూ.25 కోట్ల కుంభకోణం.. విషయం బయటకు పొక్కినా కేసు అవ్వకుండా అడ్డగింత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్శిటీలో ఓ ప్రొఫెసర్ రూ.25 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగి రెగ్యులర్ ఎంక్వయిరీ కింద కేసు రిజిస్టర్ చేసి దాదాపు సంవత్సరంపాటు విచారణ కొనసాగించింది. ప్రాథమికంగా దాదాపు రూ.25 కోట్లకుపైగా అవినీతి జరిగిందని నివేదిక రూపొందించిందని ఓయూ పీహెచ్‌డీ స్కాలర్లు చెబుతున్నారు. ఆ నివేదికను 2023లో ఉన్నత విద్యా కార్యదర్శికి అందజేసి.. ఎఫ్ఐఆర్ కు అనుమతి ఇవ్వాలని అడిగినా.. దానిని కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఉస్మానియా వర్సిటీ కానీ, ఉన్నత విద్యాశాఖ కానీ ఏసీబీకి ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారు.

పదవిలో ఉన్న సమయంలో..

ఓయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాంలో 1968లో రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్ మెంట్ స్టడీస్ సంస్థ ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై మున్సిపల్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, పట్టణాల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేయటం, ప్రభుత్వ స్కీంల అమలును పరిశోధించడం దీని లక్ష్యం. ఉద్యోగుల వేతనాలను కేంద్ర ప్రభుత్వం 30 శాతం ఇస్తుండగా, సంస్థకు శిక్షణ ద్వారా వచ్చిన నిధుల్లో 70 శాతం కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో ఉద్యోగుల నియామకం వంటి అంశాల్లోనూ ఓయూ పెట్టుకున్న నిబంధనలే వర్తిస్తాయి. ఓయూ వీసీ ఈ సంస్థకు గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉంటారు. అయితే ఈ సంస్థకు డైరెక్టర్ గా పనిచేసిన ప్రొఫెసర్ యార్లగడ్డ పార్థసారథి తన పదవిలో ఉన్న సమయంలో అందులో పనిచేసే ఉద్యోగులైన రీసెర్చ్ ఆఫీసర్ రామారావు, సూపరింటెండెంట్ గంగయ్యతో కలిసి నిధుల దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడినట్లు ఓయూ పీహెచ్ డీ స్కాలర్లు ఆరోపించారు.

డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ లో దాదాపు 750 ఉద్యోగాల నియామకాల భాద్యత రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్ మెంట్ స్టడీస్ సంస్థకు అప్పగించారు. అయితే నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ ఫీజు రూపంలో ఈ సంస్థకు దాదాపు రూ.1.36 కోట్లు వచ్చినట్లు సమాచారం. సంస్థ నియమావళి ప్రకారం ప్రతి ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఆదాయంలో 20 శాతం నిధులను ఇనిస్టిట్యూషనల్ చార్జెస్ కింద మిగిల్చాల్సి ఉంది. కానీ నిధులు దుర్వినియోగంతో పాటు ఇష్టారీతినా ఉద్యోగ నియామకాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగుల పెన్షన్ నిధులను గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి లేకుండా విత్ డ్రా చేశారని, అవసరం లేకున్నా భవనాల నిర్మాణం, శిక్షణ క్యాంపులు, ఏపీడీఎంఏ ప్రాజెక్ట్ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయననే విమర్శలు ఉన్నాయి.

ఈ అంశాలపై ఓయూ విద్యార్థులు అప్పటి వీసీ రవీందర్ కు ఫిర్యాదు చేశారు. అయితే అడ్మిషన్లు రద్దు చేస్తానని వీసీ బెదించారని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో స్కాలర్లు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ దాదాపు రూ.25 కోట్ల అవినీతి జరిగిందని తేల్చినట్లు స్కాలర్లు చెబుతున్నారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అప్పటి ఉన్నత విద్యా కార్యదర్శికి అనుమతి కోరినా పార్థసారథి తన పలుకుబడితో అడ్డుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తముందని చెబుతున్నారు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఉండేందుకు ప్రస్తుత ప్రభుత్వంతోనూ ఆయన సంప్రదింపులు జరుపుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు.

Advertisement

Next Story