ఆత్మహత్యలు వద్దు.. ఈ నిరుద్యోగి ఆలోచనే మనకు ఆదర్శం..!

by Harish |
telangana-mirchi
X

దిశ, కరీంనగర్ సిటీ : ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని వేచి చూడకోయి, ఎందరొచ్చినా నీకోసం తెచ్చేదేముండదు.. నీ జీవన నౌకను నీవే లాగాలోయ్.. అంటూ ఓ సినీ కవి రాసిన పాట అక్షరాల ఆ యువకుడికి సరితూగుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అందరికీ ఉద్యోగ, ఉపాధి కల్పించటం గగన కుసుమం అవుతుండగా, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందటం పగటి కలగా మారుతున్నది. తమ భవిష్యత్ పై ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలతో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన ఎంతో మంది యువతీ, యువకులు ఉద్యోగ వేటలో అలసిపోతున్నారు. చివరకు జీవితాలపై విరక్తి చెంది కొందరు ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారికి నగరానికి చెందిన ఆర్. నరసింహ అనే యువకుడు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అందరు నిరుద్యోగుల్లాగే తాను కూడా గ్రాడ్యుయేషన్‌తో పాటు అదనంగా సాంకేతిక విద్య ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగ వేట ప్రారంభించాడు. ఆరు నెలలు, ఏడాదిన్నర గడిచినా ఏ చిన్న ఉద్యోగం కూడా లభించలేదు.

ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఓ రోజు సాయంత్రం రోడ్డు వెంట వెళ్తుండగా వచ్చిన ఆలోచనతో ఆ మరుసటి రోజే ముకరంపురలోని దంగర్వాది స్కూల్ సమీపంలో మిర్చి బండి ఏర్పాటు చేసి, తన వ్యాపారానికి అంకురార్పణ చేశాడు. ఇప్పుడది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మారింది. ప్రారంభంలో 10 ప్లే్ట్లు అమ్మకం కాగా మిర్చీల వ్యాపారం రోజువారీగా వృద్ధి చెంది ప్రస్తుతం 250 నుంచి 300 ప్లేట్ల అమ్మకానికి చేరింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తున్న బండితో తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు యువకుడు పేర్కొంటున్నాడు. వారు కూడా గ్రాడ్యుయేట్లే కాగా ఒక్కొక్కరికి రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు అందజేస్తున్నట్లు తెలిపాడు. అన్ని ఖర్చులు పోను ఆయనకు రూ.1000 నుంచి రూ.1500 వరకు మిగులుతున్నట్లు చెప్పాడు. ఉద్యోగాల కోసం తిరిగి వేసారే నిరుద్యోగులు ఈ యువకున్ని ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలు తగ్గి వారి కుటుంబాలు వీధిన పడకుండా ఉంటాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పవచ్చును.

Advertisement

Next Story

Most Viewed