కేంద్రంపై ఇక పోరాటమే.. ఎంపీలకు సీఎం దిశానిర్దేశం

by Anukaran |
కేంద్రంపై ఇక పోరాటమే.. ఎంపీలకు సీఎం దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకెళ్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌పై న్యాయ పోరాటానికి తెలంగాణ సిద్ధమవుతున్నది. గెజిట్‌లోని అన్ని అంశాలను అధ్యయనం చేసిన సాగునీటిపారుదల అధికారులు, అడ్వొకేట్ జనరల్ దీని ద్వారా తెలంగాణకు సాగునీరు, విద్యుత్ అంశాల్లో జరగనున్న అన్యాయాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం సుదీర్ఘంగా జరిగిన చర్చలో అనేక అంశాలను లోతుగా పరిశీలించారు.

కేంద్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసిన గెజిట్ ద్వారా తెలంగాణ హక్కులకు, అధికారాలకు విఘాతం కలగడం మాత్రమేకాక సాగునీటి విషయంలో అన్యాయం జరగనున్నదని, న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో సాగునీటిపారుదల శాఖ అధికారులు, న్యాయనిపుణులతో మరో సమావేశాన్ని నిర్వహించి ఇకపైన అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతల ద్వారా తెలిసింది.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించే అంశంలో చర్చలు జరిగినప్పుడే జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులపై ఇంకా తుది ఉత్తర్వులు వెలువడలేదని, అవి వచ్చేంతవరకు బోర్డుల పరిధిని నిర్ణయించవద్దని స్పష్టంగా చెప్పినా కేంద్రం ఇప్పుడు గెజిట్ జారీ చేయడంపై సీఎం ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని వివిధ సెక్షన్లు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తదితరాలపై అడ్వొకేట్ జనరల్, అదనపు అడ్వొకేట్ జనరల్ ద్వారా వివరాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ త్వరలోనే న్యాయపోరాటం చేయడంతో పాటు ఇకపైన చేపట్టాల్సిన విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్లమెంటు సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, వెంకటేశ్ నేత మీడియాకు వివరించారు.

అన్యాయం జరగనివ్వం

సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని, ఇప్పుడు చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్రాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో సందర్భంగా దొరికినప్పుడల్లా రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని, కొట్లాడాలని సూచించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ఎంపీలందరికీ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని పెండింగ్ అంశాలపై, కేంద్రం ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలని, అవసరాన్ని బట్టి కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలను ఇవ్వాలని సూచించారు. పౌర సరఫరాల శాఖకు సంబందించిన కొన్ని అంశాలు కూడా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నందున సంబంధిత మంత్రి, అధికారులను కలిసి సాధించుకోవాలని సూచించారు.

కేసీఆర్ మౌనం

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా గెజిట్‌ను స్వాగతిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా తెలంగాణ సర్కారు మాత్రం ఇప్పటివరకు దాని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. దాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగానీ లేక స్వాగతిస్తున్నట్లుగానీ క్లారిటీ ఇవ్వలేదు. ఎంపీలు మాత్రం న్యాయ పోరాటం దిశగా కసరత్తు జరుగుతున్నదని, నిపుణులతో చర్చిస్తున్నారని, తెలంగాణకు ఈ గెజిట్ ద్వారా ఎలాంటి అన్యాయం జరుగనున్నదీ తెలుసుకుంటున్నారని, త్వరలోనే దానిపై సీఎం నేరుగా స్పష్టమైన ప్రకటన చేయనున్నారని ఎంపీలు వ్యాఖ్యానించారు. తెలంగాణ మౌనంగా ఉండడంపై లేవనెత్తుతున్న అనుమానాలకు ఎంపీలు పై విధంగా స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed