తెలంగాణ టెన్త్, ఇంటర్ ఫస్టియర్ ఆల్ పాస్..?

by Shyam |
తెలంగాణ టెన్త్, ఇంటర్ ఫస్టియర్ ఆల్ పాస్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కసరత్తు చేస్తోంది. గతేడాది ‘ఆల్ పాస్‘ తరహాలోనే ఈసారి కూడా అదే నిర్ణయం తీసుకోవడంపై ఆలోచిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో పరీక్షలు నిర్వహించడంలో ఉన్న సవాళ్ళు, విద్యార్థుల భయాందోళనలు, ఉపాధ్యాయుల సన్నద్ధత తదితరాలన్నింటినీ బేరీజు వేసుకుని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేవలం కరోనా కేసుల కారణంగానే భౌతిక తరగతులకు ఉద్వాసన పలికిన ప్రభుత్వం, ఇప్పుడు మరింత సీరియస్ కండిషన్ ఉండడంతో పరీక్షల నిర్వహణ సాధ్యమేనా అని విద్యాశాఖ ఆలోచనలో పడినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను వాయిదా వేసింది. తెలంగాణ సైతం ఆ దిశగా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

షెడ్యూలు ప్రకారం మే నెల 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు, మే నెల 27 నుంచి టెన్త్ పరీక్షలు జరిగేలా క్యాలెండర్ తయారైంది. తాజా కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ ఇటీవల ‘షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరుగుతాయి‘ అని ప్రకటించారు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు విద్యా శాఖ వర్గాల్లో వినిపిస్తున్నాయి. విద్యాశాఖ సైతం తన ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనుంది. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందువల్ల వాటినా రద్దు చేసింది.

ప్రభుత్వం పరీక్షల విషయంలో మరిన్ని సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ తరహాలోనే రాష్ట్రంలోనూ రద్దు చేసే అవకాశాలున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం. ఇంటర్ సెకండియర్‌కు మాత్రమే పరీక్షలు పెట్టి మిగిలిన తరగతుల విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed