విద్యుత్ వినియోగదారులకు త్వరలో గుడ్ న్యూస్

by Shyam |   ( Updated:2021-09-08 23:13:08.0  )
power consumers
X

దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఉన్న వినియోగదారులకు రాబోయే రోజుల్లో ఆర్థిక భారం తగ్గనుంది. ఈ మేరకు ఎస్పీడీసీఎల్ సంస్థకు, ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సంస్థకు మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా విద్యుత్ వినియోగదారులకు అతి తక్కువ ధరలోనే అధిక సామర్థ్యం ఉన్న గృహోపకరణాలు అందించనున్నట్లు ఎస్పీడీసీఎల్ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. ఈ గృహోపకరణాలు అతి తక్కువ విద్యుత్ వినియోగాన్ని మాత్రమే వినియోగించుకుంటాయని ఆయన పేర్కొన్నారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో విద్యుత్ డిమాండ్ ఆధారిత యాజమాన్య పద్ధతులను అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా అధిక సామర్థ్యం కలిగిన ఎయిర్ కండీషనర్లు, మోటార్లు, సీలింగ్ ఫ్యాన్ వంటివి వినియోగదారులకు తక్కువ ధరకే అందిస్తాయన్నారు. మొదటగా ఈ పథకాన్ని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తారన్నారు. అనంతరం క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం అమలు వల్ల పీక్ డిమాండ్ తగ్గడంతో పాటు డిమాండ్ ఆధారిత యాజమాన్య పద్ధతులను పాటించేందుకు ఆస్కారం ఉంటుందని రఘుమారెడ్డి తెలిపారు. ఈ పథకం అమలు వల్ల విద్యుత్ పంపిణీ సంస్థపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని ఆయన పేర్కొన్నారు.

ఈ పథకం అమలు కోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), ఈఈఎస్ఎల్ తగు పెట్టుబడులను, కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తాయన్నారు. ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా(ఐసీఏ) సంస్థ ఈ పథకం రూపకల్పన, అమలుకు కావాల్సిన నైపుణ్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం అమలైతే రాష్ట్రంలో అందుబాటు ఉన్న వనరుల సమర్థ వినియోగంతో పాటు అధిక మోతాదులో విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సంస్థ ఎనర్జీ ఆడిట్, డీపీఈ డైరెక్టర్ జి.గోపాల్, సీజీఎం రంగనాథ్ రాయ్, ఈఈఎస్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఎల్) ఎస్పీ గార్నిక్, ఈఈఎస్ఎల్ క్లస్టర్ హెడ్ సావిత్రి సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed