నిశి రాతిరి వేళ చీకటిలో కలిసిన వైనం

by  |
నిశి రాతిరి వేళ చీకటిలో కలిసిన వైనం
X

దిశ, న్యూస్ బ్యూరో: సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ఎన్నో విధాన నిర్ణయాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన సచివాలయం ఇక గతకాలపు స్మృతిగానే మిగిలిపోనుంది. కళ్ళ ముందే అది నేలమట్టమవుతోంది. గత ఏడాది కాలంగా సచివాలయమే లేని రాష్ట్రంగా చరిత్ర సృష్టించిన తెలంగాణ ఇప్పుడు అరవై ఏండ్ల చరిత్రను సమాధి చేస్తోంది. రెండు రూపాయలకు కిలో బియ్యం లాంటి అనేక సంచలన విధాన నిర్ణయాలకు వేదికైన సచివాలయాన్ని ఇకపైన భవిష్యత్ తరాలు ఫోటోల్లో చూసుకోవాల్సిందే. నిజాం ఆరవ నవాబు మొదలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడి వరకు పలు సందర్భాల్లో కొత్తగా ఉనికిలోకి వచ్చిన భవనాలన్నీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని దశాబ్దాల వరకూ పనికొచ్చే ఈ భవనాలను నేలమట్టం చేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోడానికి కారణం వాస్తు సెంటిమెంటేనా అనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా…

పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండే ఈ సచివాలయం ఎన్నో సంచలనాలకు, చారిత్రక ఘట్టాలకు సజీవ సాక్ష్యం. ప్రాంతాలు, పార్టీలు ఏవైనా, వ్యక్తులు మారినా పరిపాలనకు మాత్రం శాశ్వత వేదిక ఇది. వేలాది, లక్షలాది మంది ఉద్యోగులను స్వాగతించి అక్కున చేర్చుకున్నది. వేలాది మందిని పదవీ విరమణ అనంతరం సంతృప్తిగా సాగనంపింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున అనే లాండ్ మార్క్ గుర్తింపును చెరిపివేసి సచివాలయం అనే చిరునామాను సృష్టించుకుంది. జంటనగరాలుగా పిల్చుకుని హైదరాబాద్, సికింద్రాబాద్‌ ప్రాంతాలకు ఇది మీటింగ్ పాయింట్. ఎందరో ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు, సామాన్య ప్రజలకు చిరపరిచితం. కానీ ఇప్పుడు అది ఒక తీపి, చేదు జ్ఞాపకం మాత్రమే.

రాజకీయ అస్థిత్వానికి ప్రతీక

సచివాలయం ఉనికిలోకి వచ్చింది మొదలు ఇప్పుడు నేలమట్టం అయ్యేంతవరకు 17 మంది ముఖ్యమంత్రులకు, వందలాది మంది మంత్రులకు విడదీయరాని అనుబంధం ఉంది. నిజాం కాలంలో ప్రధాని కార్యాలయంగా, ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కార్యాలయంగా, సచివాలయంగా వర్ధిల్లింది. బూర్గుల రామకృష్ణారావు, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంటుగూరి అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్ధనరెడడి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాంటివారందరికీ ఈ సచివాలయమే పరిపాలనా కేంద్రంగా విలసిల్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలినాళ్ళలో కొన్నిసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడి నుంచే పాలన సాగించారు. ప్రగతి భవన్ ఏర్పడిన తర్వాత రావడమే మానేశారు. ఇక మంత్రుల విషయానికి వస్తే వందలాది మందికి ఈ సచివాలయంలో అనుబంధం ఉంది. ఎంతో మంది రాజకీయ నాయకుల అస్థిత్వాన్ని నిలబెట్టింది.

సైఫాబాద్ ప్యాలెస్ నుంచి సర్వహిత దాకా

ఇప్పుడు శిధిలాలుగా మారుతున్న సచివాలయ ప్రాంగణంలో నిజాం ఆరవ నవాబు మిర్ మహబూబ్ ఆలీ ఖాన్ 1887లో కట్టించిన భవనం కూడా ఉంది. నిజాం సంస్థానం భారత్ యూనియన్‌లో విలీనమయ్యేంత వరకూ ప్రధాని కార్యాలయంగా పనిచేసిన ఈ భవనానికి ‘సైఫాబాద్ ప్యాలెస్’గా గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ సీఎం కార్యాలయంగా వర్ధిల్లింది. ఆ తర్వాత అవసరాల నిమిత్తం సీఎం కార్యాలయం సి బ్లాక్‌లోకి మారినా సచివాలయం మాత్రం ఇదే. నిజాం కాలం నుంచి ఉనికిలో ఉన్న సర్వహిత భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో దాన్ని వాడకుండా ఖాళీగా వదిలేయాల్సి వచ్చింది. ఇదో చారిత్రక, వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత చట్టానికి సవరణలు చేయడంతో ఆ హోదాను కోల్పోయింది. కానీ అది కూలిపోకుండా చూసిన ప్రతీ ఒక్కరికీ గత కాలపు స్మృతులను పంచుతూ ఉండేది. 133 ఏళ్ళ ఈ భవనాన్ని ఇకపైన ఫోటోల్లో చూసుకోవాల్సిందే.

సంచలన, చారిత్రక ఘట్టాలకు కేంద్రం

ఎంత మంది రాజకీయ నేతలు మారినా, పార్టీలు మారినా, అధికారం మారినా పరిపాలనా కేంద్రంగా ఈ సచివాలయం సేవలందించింది. ఆంధ్ర, తెలంగాణ విభేదాలు తారాస్థాయికి చేరిన సమయంలోనూ సచివాలయం ఒక మెల్టింగ్ పాయింట్‌గా నిలిచింది. ఎన్నో సంచలన ప్రజాకర్షక పథకాలకు, విధాన నిర్ణయాలకు ఇది వేదిక. పీవీ నర్సింహారావు ప్రవేశపెట్టిన భూ సంస్కరణలుగానీ, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంగానీ, వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకంగానీ, చంద్రబాబునాయుడి కాలంలోని హైటెక్ సిటీ, సైబరాబాద్ … ఇలా కొన్ని పదుల పథకాలకు, విధాన నిర్ణయాలకు ఈ సచివాలయం సజీవ సాక్ష్యం.

అనేక పరిపాలనా సంస్కరణలకు కూడా ఇదే వేదిక అయింది. ప్రజల జీవితాలను తలకిందులు చేసినా, తలరాతలను మార్చినా, వారి భవిష్యత్తును తీర్చిదిద్దినా, అభివృద్ధికి నాంది పలికినా, విధ్వంసానికి విధాన నిర్ణయం తీసుకున్నా ఇదే వేదిక అయింది. కొన్న వేల మంది ఐఏఎస్‌లకు గుర్తింపు తెచ్చినా, మరికొద్దిమందిని జైళ్ళపాలు చేసినా, ఇంకొద్దిమందిని నేరారోపణలకు గురిచేసినా దానికి కారణం ఈ సచివాలయమే. లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాల రూపంలో స్వాగతం పలికి, వారికి పరిపాలనా అవగాహన కలిగించి, పదోన్నతులు ఇచ్చి, చివరకు పదవీ విరమణ సందర్భంగా సాదరంగా సాగనంపింది కూడా ఈ సచివాలయమే.

తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం లాంటి కీలక నిర్ణయాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అండగా నిలిచింది ఈ సచివాలయమే. ఎన్నో తరాలకు ఇది చిరపరిచితం. మరెన్నో తరాల జీవితాల్లో వెలుగులు నింపిన కేంద్రం. దశాబ్దాలుగా ఠీవీగా నిలబడి కోట్లాది మంది ప్రజల ముఖాల్లో చిరునవ్వులు నింపి, జీవనాధారంగా ఉండే నిర్ణయాలకు కేంద్రమైన ఈ సచివాలయం ఇప్పుడు కళావిహీనంగా మారిపోయింది. ఇప్పుడు కనిపిస్తున్న శిధిలాలు కొన్ని రోజుల్లోనే కనుమరుగు కూడా కానున్నాయి. భవిష్యత్తులో దర్బారును తలపించే కొత్త ఇంద్ర భవనం ఉనికిలోకి రావచ్చేమో! కొంతకాలం వరకూ ఈ ప్రాంతాన్ని పాత సచివాలయంగా పిలుచుకున్నా కొత్తది వచ్చిన తర్వాత దీని చిరునామా ఎలా మారుతుందో! ఇప్పటిదాకా సజీవసాక్ష్యంగా ఉన్న ఈ భవనాలు రేపటికి చరిత్ర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.


Next Story

Most Viewed