గోదావరి బోర్డును ఎత్తేయండి.. తెలంగాణ రిక్వెస్ట్

by Shyam |
గోదావరి బోర్డును ఎత్తేయండి..  తెలంగాణ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నదిపై ఉన్న ఇరిగేషన్​ ప్రాజెక్టుల అంశంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేవని, ఇక్కడ పెద్దగా సమస్యలు, ఉమ్మడి ప్రాజెక్టులు లేనందున గోదావరి బోర్డు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి బేసిన్​ విషయంలో నీటి పంచాయతీలు లేవని, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేకంగా గోదావరి రివర్ మేనేజింగ్ బోర్డు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కృష్ణా, గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డులకు విడుదల చేసిన గెజిట్​ నోటిఫికేషన్​ లోని పలు అంశాల అమలుపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా రెండు రాష్ట్రాల సీఎస్​లతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ తరుపున సీఎస్​ సోమేశ్​ కుమార్​ పలు అంశాలను కేంద్రానికి వివరించారు. గోదావరి బేసిన్‌లోని ఐదు ప్రాజెక్టులు రామప్ప-పాకాల లింక్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ (రోజుకు అదనపు టీఎంసీ), కందకుర్తి ఎత్తిపోతల పథకం, గూడెం లిఫ్ట్​, పీవీ నర్సింహారావు కంతనపల్లి బ్యారేజీ ప్రాజెక్టులను గెజిట్​ నోటిఫికేషన్​లో అనుమతి లేని ప్రాజెక్టులంటూ జాబితాలో తప్పుగా చేర్చారని కేంద్ర జలశక్తి దృష్టికి తీసుకెళ్లారు.

జీఆర్​ఎంబీ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నుంచి ఈ ఐదు ప్రాజెక్టులను అనుమతి లేని ప్రాజెక్ట్‌ల జాబితా నుంచి తొలగించాలని సీఎస్​ కోరారు. అదే విధంగా గతేడాది అక్టోబర్​లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయడానికి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని కోరారని, దాని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం పిటిషన్​ ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. ట్రిబ్యునల్​ అంశంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కోరారు. అయితే ఈ అంశానికి సంబంధించి న్యాయ శాఖ అభిప్రాయానికి పంపామని, లా డిపార్ట్‌మెంట్ నుండి అభిప్రాయం వచ్చిన వెంటనే ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయనున్నట్లు కేంద్ర కార్యదర్శి సూచించారు. అదే విధంగా గోదావరి నదిపై సీతారామ ఎత్తిపోతలు, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ (తుపాకులగూడెం ప్రాజెక్ట్), ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతలు, చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలు, మోడికుంటవాగు ప్రాజెక్టు, చనాకా-కొరాట బ్యారేజీ ఆరు ప్రాజెక్టుల డీపీఆర్​లు సెప్టెంబర్​లో సమర్పించామని, ఈ డీపీఆర్​లు, అనుమతుల అంశం కేంద్ర జల సంఘంలో పెండింగ్​ ఉన్నాయని సీఎస్​ సూచించారు. వాటిని పరిశీలించిన తర్వాత అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా కృష్ణా నదిపై ఏపీ చేపట్టిన అక్రమ నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ హామీ ఇచ్చారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, సీఎం కార్యాలయ ఓఎస్డీ శ్రీధర్​ దేశ్‌పాండే పాల్గొన్నారు.

Advertisement

Next Story