జేఎల్‌ల సంఘం అధ్యక్షుడు ఆస్తుల అటాచ్ !

by Shyam |   ( Updated:2020-04-25 08:21:21.0  )
జేఎల్‌ల సంఘం అధ్యక్షుడు ఆస్తుల అటాచ్ !
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తెలంగాణ జూనియర్ లెక్చరర్ల (జేఎల్) సంఘం అధ్యక్షుడు పి.మధుసూధన్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో భాగంగా ఆయన అక్రమంగా పోగేసినవిగా ఆరోపణలున్న మొత్తం ఆస్తులను అటాచ్‌‌మెంట్‌ చేసేందుకుగాను దర్యాప్తు సంస్థ ఏసీబీకి తాజాగా ప్రభుత్వం అనుమతిచ్చింది. మధుసూధన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పేర్ల మీద ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.3 కోట్ల 6వేలు ఉంటుందని, వాటి వివరాలను ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అటాచ్ చేయకపోతే మధుసూధన్‌రెడ్డి తన ఆస్తులను అమ్మేసే ప్రమాదముందని కేసు దర్యాప్తు అధికారి ప్రభుత్వానికి లేఖ రాయడంతోనే ఈ అనుమతిచ్చినట్టు జీవోలో పేర్కొన్నారు. జీవో జారీ అయినందున కేసు విచారణ జరుగుతున్న హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో ఏసీబీ అటాచ్‌మెంట్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనమిక్స్ లెక్చరర్‌గా మధుసూధన్ రెడ్డి పనిచేస్తున్నారు. తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా సకలజనుల సమ్మెలో మధుసూధన్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Tags: telangana, junior lecturer, madhusudhan reddy, acb case, assets attach, g.o

Advertisement

Next Story

Most Viewed