- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పు మాదే.. గడువు మీ ఇష్టం.. ప్రాజెక్టులపై ప్రభుత్వం తీరిదే!
దిశ, తెలంగాణ బ్యూరో : కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. రాష్ట్రంలోని 25 ప్రాజెక్టుల పరిధిలో 61 ప్యాకేజీల పనులకు నిర్మాణ గడువు పెంచింది. ఈ ప్రాజెక్టుల పనులు పూర్తయ్యే వరకూ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వాటికి 2021–22 ప్రకారం ప్రైస్ఎస్కలేషన్ (ధరల పెంపు) కూడా వర్తిస్తుందని వెల్లడించింది. ఈ లెక్కన ప్రాజెక్టులపై మరో రూ. 450 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
భూ సేకరణ, పరిహారమే సమస్య
రాష్ట్రంలో కొన్నేండ్ల కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదు. కానీ నిబంధనల ప్రకారం వాటికి ఏటేటా ప్రైస్ఎస్కలేషన్వర్తిస్తూనే ఉంది. దీంతో వందల కోట్ల నిర్మాణ వ్యయం పెరుగుతూనే ఉంది. అయితే ఈ ప్రాజెక్టుల పరిధిలో పనులు పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం భూ సేకరణ అని ప్రభుత్వం పేర్కొంది. కల్వకుర్తి, ఆర్బీఎల్, దేవాదుల, నెట్టెంపాడు, సింగూరు ప్రాజెక్టుల పరిధిలో ప్రధాన కాల్వలు కొంత మేరకు పూర్తి చేయలేకపోయామని వెల్లడించింది.
ఫీల్డ్కెనాళ్లు పూర్తికాకపోవడం, దీనికి భూ సేకరణ సమస్యగా మారిందని వివరించారు. అదే విధంగా మరికొన్ని ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ, ఆర్అండ్ఆర్ పనుల బిల్లులు ఆలస్యమయ్యాయని ప్రభుత్వం ఒప్పుకుంది. ఇలాంటి కారణాలతో రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టుల పనులు ఆలస్యమవుతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువ గత ప్రభుత్వ హాయాంలో నుంచి పనులు మొదలుపెట్టినవే ఉన్నాయి.
ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారు
కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని మరోసారి రుజువైంది. ఉమ్మడి ఏపీలో తలపెట్టిన ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చెరువులు నింపడం మినహా స్వరాష్ట్రంలో సాధించింది ఏమీ కనబడటం లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌తో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సకాలంలో పూర్తి చేయడం లేదు. కల్వకుర్తి, బీమా ఇంకా సాగుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోల్లోనే తేలుతోంది. వీటితో పాటుగా మొత్తం 25 ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతున్నట్లు వెల్లడించింది.మరోవైపు వీటన్నింటికీ కొత్త ధరలను వర్తింప చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైస్ఎస్కలేషన్లో భాగంగా లేబర్, నిర్మాణ సామాగ్రి, సిమెంట్, స్టీల్, ఇంధన ధరలను సవరించనున్నట్లు ప్రభుత్వం వివరించింది.
ఈవోటీ పొందిన ప్రాజెక్టులు ఇవే
రాష్ట్రంలోని 25 ప్రాజెక్టుల పరిధిలో 61 ప్యాకేజీలను నిర్మాణం పూర్తయ్యే వరకు గడువు ఇచ్చింది. గతంలో ఏటేటా గడువును సమీక్షించేవారు. ఒకవేళ కాంట్రాక్టర్ల జాప్యం ఉంటే జరిమానా విధించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే తప్పుని ఒప్పుకుని ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడే గడువుగా పేర్కొంది.
కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని ప్యాకేజీ 28, 29, 30, స్టేజ్ –3, ఆర్బీఎల్ఐఎస్పీలోని ప్యాకేజీ 13, 14, 18, 21, 22, 27, 46, నెట్టెంపాడులోని ప్యాకేజీ 100, 104, 105, 106, 107, 108, 109, సింగూరు పరిధిలోని సింగరు కాల్వలు, దేవాదుల పరిధిలోని ఆర్ఎస్ ఘనపూర్ సీ–2, 4ఎల్, అశ్వరావుపల్లి, తపాస్‌పల్లి, ప్యాకేజీ 3, 4, 5,6,7,8, ఎస్సారెస్పీ –2లోని సీ2–54, ఎల్లంపల్లిలోని ప్యాకేజీ –3, మంథని లిప్ట్, కెనాల్ ప్యాకేజీ –1, గ్రావిటీ కెనాల్, స్టేజ్ –2లోని ఫేస్ –1, కాళేశ్వరం ప్రాజెక్టు, నీల్వాయి పరిధిలోని ప్యాకేజీ 12, పెద్దవాగు పరిధి ప్యాకేజీ 19, పాలెంవాగు పరిధి ప్యాకేజీ 7, కాళేశ్వరం స్టేజ్–2, ఎఫ్ఎఫ్సీ పరిధిలోని ప్యాకేజీ 2, 3,5,6,7, ప్యాకేజీ –8లోని ఎస్సారెస్పీ లిప్ట్, ఏఎమార్పీ పరిధిలోని ఉదయసముద్రం, ఎల్ఎల్బీసీ టన్నైల్, కొమురం భీం ప్రాజెక్టు పరిధి సీ–1–18, ఎస్సారెస్సీ పరిధి లక్ష్మీ కెనాల్, కోనాయమాకుల లిప్ట్, కాళేశ్వరం పరిధి స్టేజ్–1, నెట్టెంపాడు పరిధి ప్యాకేజీ 98, 99ఏ, దేవాదుల ఫేజ్–1 పరిధి సీ2–45,46, ఫేజ్–3లోని ప్యాకేజీ 2, ఎస్సారెస్పీ–2 పరిధిలోని ప్యాకేజీ 53,55,58, ఏఎమ్మార్పీ ఎస్ఎల్బీసీ పరిధిలోని ప్యాకేజీ నెంబర్ 110కు నిర్మాణ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.