అన్‌లాక్: నేడు కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం

by Anukaran |   ( Updated:2021-06-17 20:58:52.0  )
cm-kcr government
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఒకవైపు లాక్‌డౌన్ గడువు దగ్గర పడుతున్నది. ఆంక్షలను మరింతగా సడలించి అన్‌లాక్ దిశగా వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నది. కరోనా టాస్క్ ఫోర్స్ చైర్మన్‌గా మంత్రి కేటీఆర్ సైతం త్వరలో సాధారణ స్థితి నెలకొంటుందని మూడు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. కానీ ఇదే సమయంలో మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ విజృంభించే ప్రమాదం ఉన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంచనా వేసి నాలుగు వారాల్లో థర్డ్ వేవ్ ఒకింత తీవ్రతతోనే వచ్చే అవకాశం ఉన్నదంటూ వైద్యారోగ్య శాఖను అప్రమత్తంగా చేశారు. టాస్క్ ఫోర్సును కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దు కలిగిన తెలంగాణలో ఏం చేయాలనేదానిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

లాక్‌డౌన్ ఆంక్షలను మరింతగా సడలించి అన్‌లాక్ దిశగా వెళ్ళడమా లేక సరిహద్దు జిల్లాల్లో కట్టడి చర్యలను పటిష్టం చేసే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడమా.. అనే అంశాలపై ప్రధాన కార్యదర్శితో వైద్యారోగ్య శాఖ అధికారులు చర్చిస్తున్నారు. ఆంక్షలను మరింతగా సడలించవచ్చనేది వైద్యారోగ్య శాఖ అధికారుల అభిప్రాయం. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్న సడలింపులను రాత్రి పది గంటల వరకూ పొడిగించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. గతంలో కొనసాగిన నైట్ కర్ఫ్యూ తరహా విధానమే కొనసాగవచ్చన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

వైద్యారోగ్య శాఖ నుంచి అభిప్రాయాలను తీసుకున్న ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ముఖ్యమంత్రికి వివరించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితి గురించి, శాంతిభద్రతల కోణం నుంచి డీజీపీ సైతం సీఎంకు వివరించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌పై తదుపరి నిర్ణయం శుక్రవారం రాత్రికి వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ శనివారంతో ముగుస్తుంది. ఆదివారం నుంచి ఎలాంటి ఆంక్షలు, సడలింపులు ఉంటాయోననే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం రాత్రికి లేదా శనివారం ఉదయానికి స్పష్టమైన ప్రకటన చేయవచ్చని సమాచారం.

సెకండ్ వేవ్ రిపీట్ కాకుండా…

లాక్‌డౌన్ కారణంగా కరోనా తీవ్రత తగ్గి కొత్తగా నమోదయ్యే కేసులు కూడా గణనీయంగా అదుపులోకి వచ్చాయి. లాక్‌డౌన్ మంచి ఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి సహా వైద్యాధికారులు వ్యాఖ్యానించారు. కానీ అదే సమయంలో ఆదాయం తగ్గిపోయిందని, ఒక్క నెలలోనే సుమారు రూ. 4,100 కోట్లు తగ్గిపోయినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఇంకోవైపు పీఆర్సీ వేతనాల పెంపును జూలైలో అందుకోబోయే జీతంతో వస్తుందని ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది. రాష్ట్ర రోజువారీ అవసరాలతో పాటు రైతుబంధు, పీఆర్సీ వేతనాల పెంపు లాంటివి రావడంతో అదనపు ఆదాయ వనరులు అవసరమవుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ ముప్పుతో మళ్ళీ లాక్‌డౌన్ లాంటి నిర్ణయం, ఆంక్షలను మరింత పెంచడం లాంటివి తీసుకుంటే ఆదాయం మరింతగా పడిపోతుందన్నది కూడా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది.

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్‌కు దారితీసిన కారణాల్లో ప్రధానమైనది మహరాష్ట్ర నుంచి వైరస్ వ్యాప్తి కావడమేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇప్పటికే వ్యాఖ్యానించింది. సెకండ్ వేవ్ ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో థర్డ్ వేవ్ రావచ్చని మహారాష్ట్ర అంచనా వేయడంతో నిజామాబాద్ లాంటి జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలపై వైద్యారోగ్య శాఖ దృష్టి పెట్టింది. మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ సృష్టించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని థర్డ్ వేవ్ ద్వారా అలాంటి పరిస్థితి రాకుండా ఏం చేయాలనేదానిపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. సెకండ్ వేవ్ ప్రారంభంలో సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులకు ప్రభుత్వం సూచించినా పటిష్ట చర్యలు తీసుకోకపోవడంతో పాజిటివ్ కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. ఈసారి అలాంటి అవకాశం రాకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed