విరించి ఆసుపత్రిపై వేటు

by Shyam |
విరించి ఆసుపత్రిపై వేటు
X

దిశ, న్యూస్ బ్యూరో: సోమాజీగూడలోని దక్కన్ ఆసుపత్రిపై వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గంటల వ్యవధిలోనే బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిపై కూడా వేటు వేసింది. కరోనా ట్రీట్‌మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఇకపైన కొత్తగా కరోనా పేషెంట్లను అడ్మిట్ చేసుకుని చికిత్స ఇవ్వవద్దని, ఇప్పటికే అడ్మిట్ అయి ఉన్న పేషెంట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీల ప్రకారమే చికిత్స అందించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం రాత్రి జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కాకుండా ఎక్కువ ఛార్జీలను వసూలుచేసినా, రోగులను ఇబ్బంది పెట్టినా, నిబంధనలను ఉల్లంఘించిన ఆసుపత్రి లైసెన్సు (గుర్తింపు)ను కూడా రద్దు చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. రెండు రోజుల వ్యవధిలో రెండు ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం వేటువేసింది.

ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పేరుతో లక్షలాది రూపాయలను వసూలుచేస్తూ డబ్బులు కట్టకుంటే మృతదేహాలను కూడా ఇవ్వబోమంటూ వ్యవహరించే తీరుపై ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఫిర్యాదులను ఇవ్వడానికి ప్రజల సౌకర్యం కోసం ఒక వాట్సాప్ నెంబర్‌ను కూడా ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఏర్పాటు చేశారు. దీనికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వైద్య నిపుణులతో దర్యాప్తు జరిపించి ఆ బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఆయా ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ ప్రకారం దక్కన్ ఆసుపత్రిపై సోమవారం రాత్రి చర్యలు తీసుకోగా, మరుసటి రోజైన మంగళవారం విరించి ఆసుపత్రికి కరోనా ట్రీట్‌మెంట్ కోసం ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ప్రజారోగ్య చట్టం, తెలంగాణ అలోపతిక్ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలోని నిబంధనల మేరకు ఈ ఆసుపత్రులకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed