ఊరచెరువు ఉఫ్.. గండిచెరువు గాయబ్!

by Shyam |   ( Updated:2020-02-29 03:32:35.0  )
ఊరచెరువు ఉఫ్.. గండిచెరువు గాయబ్!
X

దిశ న‌ల్ల‌గొండ‌: బంగారమసొంటి చెరువు కోనేరు అవుతోంది. యాదాద్రి నరసన్నకు నైవేద్యమవుతున్నది ! కాదు, కాదు నేవేద్యం చేసేస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా 41.15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు, కుంట గాయబ్ అవుతున్నాయి. దేవుడు కోరుకున్నాడో ఏమో తెలియదు గానీ వరుసగా పగబట్టినట్లుగా యాదగిరిపల్లి నీటి వనరుకులకే ఎసరు పెడుతున్నారు. ముందుగాల ‘ఊరకుంట’ ఉసురు తీసి రింగ్‌రోడ్డుగా మార్చగా ఇప్పుడు ‘గండి చెరువు’ను కోనేరుగా మార్చుతూ లేయర్ల కొద్ది సిమెంట్, కాంక్రీట్ పోస్తున్నారు. చెరువులో నీరుంటే భూగర్భ జలాలకు ఇబ్బంది లేకుండా 70ఎకరాల ఆయకట్టుతోపాటు అదనంగా 1200 ఎకరాలు సాగు చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉండేది. కానీ గండిచెరువు ఉనికిపై దాడికి దిగడంతో రైతులకు ఇబ్బందులొచ్చి పడ్డాయి.

కాక‌తీయుల కాలం నాటి చెరువు

మ‌ల్ల‌ాపురం వెళ్లేదారిలో సర్వే నెం.125లోని 35.28 ఎక‌రాల విస్తీర్ణంలో కాక‌తీయుల కాలంలో గండిచెరువును త‌వ్వారు. మిష‌న్ కాక‌తీయ పథకంలో భాగంగా రూ.20ల‌క్ష‌ల ఖ‌ర్చుతో చెరువులో పూడిక‌ తీయించగా భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయి. అలాగే సర్వే నెంబర్ 65లోని 5.27ఎక‌రాల విస్తీర్ణంలో ఊర‌కుంటను సైతం రూ.25ల‌క్ష‌ల ఖ‌ర్చుతో ఆధునీకరించి, దిగువ‌న చెక్‌డ్యాం నిర్మించారు. చెరువు, కుంట నిండితే యాద‌గిరిప‌ల్లి రెవెన్యూ ప‌రిధిలో ఉన్న 1603.24 ఎక‌రాల‌కు సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. 70ఎక‌రాల వ‌ర‌కు ఆయ‌క‌ట్టు కూడా సాగ‌య్యేది. అయితే యాద‌గిరికొండ‌ చుట్టూ నిర్మిస్తున్న‌ నాలుగు వరుసల రింగ్‌రోడ్డుకు ఊర‌కుంట మాయం కాగా కొండ కింద గ‌ల గండిచెరువును తెప్పోత్స‌వం కోసం కోనేరుగా మారుస్తున్నారు.

1,273 ఎక‌రాల‌కు సాగునీరు క‌ష్ట‌మే

యాద‌గిరిప‌ల్లి రెవెన్యూ రికార్డు ప్ర‌కారం 1నుంచి 155 వ‌ర‌కు స‌ర్వే నెంబ‌ర్‌లో 1603.24 ఎక‌రాల భూమి ఉంది. ఇందులో 78, 79, 119, 134 స‌ర్వే నెంబ‌ర్ల‌లో 147.07 ఎక‌రాల్లో స్వామివారి ఆల‌యంతో పాటు గుడి భూములు ఉన్నాయి. ఆల‌య పునర్ నిర్మాణం కోసం వైటీడీఏ ప‌రిధిలో తొలి విడ‌త‌లో 73, 78 నుంచి 119 వ‌ర‌కు ఉన్న సర్వే నెంబర్లలో 93.03 ఎకరాలు, రెండో విడ‌త‌లో 49.24 ఎకరాలు మొత్తంగా క‌లిపి 142.27 ఎక‌రాలు సేకరించారు. ఆతర్వాత రింగ్‌రోడ్డుకు అడ్డుగా వ‌చ్చిన సర్వే నెంబ‌ర్‌ 65లో 5.27 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఊర‌కుంటను కొండ కింద భ‌క్తులు స్నాన‌మాచ‌రించ‌డం కోసం, స‌ర్వే నెంబ‌ర్ 125లోని 35.28 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న గండి చెరువు భూమిని వైటీడీఏ తీసుకొంది. ఇలా నీటి వ‌న‌రుల‌ను కొల్ల‌గొట్టడంతో రైతుల‌తో పాటు జీవాలు సాకుతున్న వారి బ‌తుకుదెరువుకు ముప్పు వాటిల్లే పరిస్థితులు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed