- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సారీ! రేపటి నుంచి బియ్యం ఇవ్వలేం!
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పరిస్థతి నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు రేషను దుకాణాల ద్వారా బియ్యం ఇవ్వలేకపోతున్నామని రాష్ట్ర చీఫ్ రేషనింగ్ అధికారి బాల మాయాదేవి స్పష్టం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున రేషను దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేయాలనుకున్నామని, ఈ నెల 27వ తేదీ నుంచే ఆ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నదని, అయితే అవసరమైనంత స్థాయిలో సమకూరకపోవడంతో అనుకున్న సమయానికి పంపిణీ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 674 రేషను దుకాణాల ద్వారా సుమారు 26,377 టన్నుల మేర బియ్యాన్ని సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లూ జరిగాయని, కానీ అనుకున్న స్థాయిలో బియ్యం సమకూరకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
రేషను దుకాణాల ద్వారా మాత్రమే కాకుండా డిపార్టుమెంటు అధికారుల ద్వారా బియ్యాన్ని సరఫరా చేయడానికి అదనంగా 18 కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. కానీ, బియ్యాన్ని సమకూర్చుకోవడంలో తలెత్తిన కొన్ని సవాళ్ళ కారణంగా అనుకున్న సమయానికి ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. ఇంకా సేకరణ దశలోనే ఉన్నదని, రేషను దుకాణాల దాకా చేరడానికి సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. తిరిగి ఎప్పటి నుంచి సరఫరా చేసే తేదీని ఇంకా ఖరారు చేయలేదని, స్పష్టత వచ్చిన తర్వాత తెలియజేస్తామని ఆమె విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కరీంనగర్‌లో రేషను సరఫరా షురూ
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం రేషను దుకాణాల ద్వారా బియ్యం సరఫరాను ప్రారంభించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు ఇండ్లకు మాత్రమే పరిమితం కావాలనీ, ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే ప్రజలు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రతి నెలా ఇచ్చే ఆరు కిలోల బియ్యానికి అదనంగా మరో ఆరు కిలోలు ఇస్తోందని వివరించారు. ఎవ్వరూ బయటకి రావొద్దని కోరారు. బియ్యం తీసుకునేటప్పుడు వినియోగదారులు బయోమెట్రిక్ మిషన్‌లో వేయాల్సిన వేలిముద్రల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. వినియోగదారులు వేలిముద్ర వేసే ప్రతిసారీ శానిటైజర్‌ను ఉపయోగించాలని ఇప్పటికే స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు. రేషను దుకాణాల దగ్గర ఒకేసారి ఎక్కువమంది గుమికూడకుండా ఉండేందుకు వినియోగదారులకు టోకెన్ల విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు.
రేషను బియ్యానికి హమాలీల కొరత
రాష్ట్రంలో ‘లాక్‌డౌన్’ కొనసాగుతున్నందున రాష్ట్రంలోకి లారీల ద్వారా వచ్చే నిత్యావసర వస్తువుల రవాణాపై ఆ ప్రభావం పడింది. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చే వస్తువుల రవాణాకు హమాలీల కొరత ఏర్పడింది. రేషను దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేసే ప్రక్రియమై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సత్యానారాయణ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించి బహిరంగ దుకాణాల్లో విక్రయించే నిత్యావసర వస్తువుల ధరలపై వ్యాపారులతో చర్చించారు. ఈ సందర్భంగా హమాలీల అంశాన్ని కమిషనర్ దృష్టికి వ్యాపారులు తీసుకొచ్చారు. మిర్యాలగూడ నుండి 800 టన్నుల బియ్యం రవాణాకు పెద్దగా ఇబ్బంది లేకున్నా, సూర్యాపేటలో మాత్రం హమాలీల కొరతతో సకాలంలో రవాణా కావడంలేదని వివరించారు. సూర్యాపేట నుంచి బియ్యం రవాణా ఈ కారణంగానే పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులతో కమిషనర్ మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీచేశారు.
కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మవద్దని, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాపార ధోరణితో కాకుండా మానవతాదృక్పథంతో, సామాజిక బాధ్యతగా పనిచేయాలని వ్యాపారులకు సూచించారు. ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అధిక ధలపై విజిలెన్స్ బృందాలు ప్రత్యేకంగా నిఘా వేశాయని, అధిక ధరలకు విక్రయించినట్లు తేలితే పీడీ యాక్టు నమోదు తప్పదని హెచ్చరించారు.