- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమలం గూటిలో ఉండి కలత చెందుతున్నారు.. వారెవరంటే..?
వివిధ పార్టీలలో పోలిట్‌బ్యూరో, రాష్ట్రస్థాయి నాయకులుగా ఉండి బీజేపీలో చేరిన అనేక మంది ఇప్పుడు జిల్లా లేదా అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు. రాష్ట్ర మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసినవారు సైతం ఎలాంటి పదవులు లేకుండా వారివారి ప్రాంతాలలోనే పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. స్వంత పార్టీల్లో ఆదరణ కరువై, పార్టీ భవిష్యత్తుపై అనుమానంతో బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్రస్థాయి పదవులు వస్తాయనే ఆశించారు. కానీ, వారి ఆశలు నెరవేరడం లేదు. దీంతో వారిలో అంతర్మథనం మొదలయ్యింది.
దిశ, తెలంగాణ బ్యూరో : చాలా మంది సుదీర్ఘకాలంగా సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నా బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్రస్థాయి కార్యకలాపాలలో పాల్గొనలేకపోతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత అక్కడే పార్టీని పటిష్టం చేసే పనులతోనే సర్దుకుపోతున్నారు. స్వంత పార్టీలో ఇమడలేక, ఇప్పుడు బీజేపీలో ఎలాంటి పోస్టులు లేక అంతర్మథనంలో పడ్డారు. బీజేపీని కాదనుకుని బైటకు వెళ్ళలేని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. కనీసం బైటకు కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఒకరిద్దరు ఇప్పటికే బైటకు వెళ్ళిపోయారు. ఇంకొందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగొచ్చారు.
కొద్దిమందికి జాతీయ స్థాయిలో బాధ్యతలు దక్కాయి. మరికొద్దిమందికి ఇతర రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతలు దక్కాయి. కొద్దిమంది మాత్రం రాష్ట్రంలోనే ఎలాంటి బాధ్యతలు లేకుండా సైలెంట్‌గా ఉండాల్సి వస్తోంది. జాతీయ నాయకత్వం వచ్చినప్పుడు బహిరంగసభలను చూసుకోవడంతో సరిపెట్టుకుంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి దాదాపు డజను మందికిపైగా బీజేపీలో చేరారు. పెద్దగా ప్రాధాన్యం లభించలేదనే అసంతృప్తితో ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పైగా ఒకరితో ఒకరు పంచుకునే అవకాశమూ లేకుండాపోయింది.
కేంద్ర నాయకత్వం హామీలు పుష్కలం
బీజేపీలో చేరేటప్పుడే ఎలాంటి పదవులూ ఆశించవద్దని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యకలాపాలపైనే దృష్టి పెట్టాలని కేంద్ర నాయకత్వం వారికి చెప్పింది. ఏ సమయంలో ఎవరి సేవలను ఏ పద్ధతిలో వినియోగించుకోవాలో పార్టీ చూసుకుంటుందని, రాష్ట్ర స్థాయి బాధ్యతలు వస్తాయన్న ఆశలు పెట్టుకోవద్దని ప్రారంభంలో చెప్పినందునే ఇప్పుడు సైలెంట్‌గా ఉండిపోయినట్లు ఒకరిద్దరు పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వం పట్ల వీరికి ఎలాంటి అసంతృప్తి లేకపోయినా రాష్ట్ర నాయకత్వం తగిన తీరులో తమ సేవలను వినియోగించుకోలేపోతోందనే అసంతృప్తి మాత్రం వీరికి ఉంది.
కానీ దీన్ని ఎక్కడా బైటకు చెప్పుకోకుండా దిగమింగుకుంటున్నారు. కొన్నిసార్లు సర్దుకుని ఉండిపోతున్నారు. పాత పార్టీల్లో రాష్ట్ర స్థాయి నాయకత్వంగా అన్ని కార్యక్రమాల్లో బహిరంగంగా కనపడే అవకాశం ఉండేదని, ఇప్పుడు రాష్ట్రస్థాయి గుర్తింపు లేదనేది వాస్తవమేనని ఒకరు పేర్కొన్నారు. తగిన సమయం కోసం ఎదురుచూడక తప్పదని పేర్కొన్నారు. అందరికీ అన్ని అవకాశాలూ లభించకపోవచ్చని, డీకే అరుణ లాంటివారికి జాతీయ స్థాయి బాధ్యతలు దక్కాయి గదా అని గుర్తుచేశారు. సమయానుకూలంగా అవకాశాలు లభిస్తాయన్న ఆశ మాత్రం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్ర నాయకత్వ తీరు ఎలా ఉన్నా కేంద్ర నాయకత్వం మాత్రం తమ పట్ల సాఫ్ట్‌గానే ఉందని, ఎవరిని ఏ అవసరాలకు వాడుకోవాలనేదానిపై స్పష్టత ఉందని, ఆ విషయాలను తమతోనే చర్చిస్తోందని బీజేపీలో చేరిన నేత ఒకరు వివరించారు. త్రిపుర రాష్ట్రం వామపక్ష పార్టీకి కంచుకోట అయినా ఒక ప్లాన్ ప్రకారం పార్టీ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళడంతో హోదాలను, సీనియారిటీని కాదని బాధ్యతలు చేపట్టడం ద్వారానే బీజేపీ అధికారంలోకి రాగలిగిందని, ఇప్పుడు తెలంగాణలో సైతం అదే ఫార్ములాను అవలంబిస్తున్నట్లు పార్టీ తమకు అర్థం చేయించిందని, ఆ ప్రకారమే పని చేస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్ర నాయకత్వంతో తమకు సంబంధం లేదని, కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకే పార్టీ పనుల్లో ఉన్నామని తెలిపారు.
వ్యూహాత్మకంగానే పని విభజన
టీఆర్ఎస్‌ను ఢీకొడతామని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెప్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో ఆ నేతలను సరైన తీరులో వాడుకోవడంలేదని, బాధ్యతలు అప్పజెప్పడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం మాత్రం తాము పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టినందువల్ల ఎవరికి ఏ నియోజకవర్గంలో ఎంత పలుకుబడి ఉందో దానికి అనుగుణంగానే గ్రామస్థాయి కార్యకర్తలను తయారుచేసుకోవడంలో వారి సేవలను వాడుకుంటున్నట్లు చెప్తోంది.
దుబ్బాక ఎన్నికల సమయంలో, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, డీకే అరుణ, పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్ లాంటివారికి నిర్దిష్ట బాధ్యతలు అప్పజెప్పామని, ఆశించిన ఫలితాన్ని సాధించామని రాష్ట్ర నాయకుడు ఒకరు వివరించారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సైతం ఇదే తరహాలో వారిని వినియోగించుకుంటున్నామని, ఎన్నికలు అయిపోగానే మళ్ళీ నియోజకవర్గాలపైనే దృష్టి పెడతారని తెలిపారు. గతంలో వారు ఉన్న పార్టీలో పోషించిన పాత్ర ఇప్పుడు బీజేపీలో ఉండకపోవచ్చని, పార్టీ పని విధానంలో తేడా ఉంటుందని తెలిపారు. ఒకరిద్దరిలో అలాంటి అసంతృప్తి ఉండవచ్చేమోగానీ పార్టీని కాదనుకుని నీరసపడేంత స్థాయిలో మాత్రం లేదని పేర్కొన్నారు.