తెలంగాణలో బీజేపీని పవర్ లోకి తెస్తా : బండి సంజయ్ ఇంటర్వ్యూ..

by Shyam |
తెలంగాణలో బీజేపీని పవర్ లోకి తెస్తా : బండి సంజయ్ ఇంటర్వ్యూ..
X

దిశ, కరీంనగర్: క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో సీనియర్ల ఆశీస్సులతో ప్రజా ఉద్యమాలు చేపడుతూ బీజేపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ పాలన తీరును వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తానని, అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అవలంభిస్తూ తప్పయితే కేంద్రంపై, మంచైతే రాష్ట్రానిదేనని గొప్పలు చెప్పుకునే పద్ధతి కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బండి సంజయ్‌తో దిశ ప్రత్యేక ఇంటర్వ్యూ..

బీజేపీ అధ్యక్షునిగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది..?

సంజయ్: రాష్ట్రంలో బలమైన శక్తిగా బీజేపీని తీర్చిదిద్దడమే లక్ష్యం. పార్టీ సీనియర్ నాయకుల ఆశీస్సులతో బలోపేతం చేసేందుకు క్షేత్ర స్థాయిలో పనిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాను ప్రజలకు వివరించడమే మా ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. నిర్మాణాత్మక పాత్ర పోషించడమే మా విధి. బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ కేడర్‌లో నూతనోత్తేజం నింపనున్నాం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకరావడం కోసం అన్నిరకాలుగా నావంతు ప్రయత్నం చేస్తా. గల్లీ గల్లీలో, గ్రామ గ్రామాన కార్యకర్తలకు ప్రోత్సాహాన్నిస్తూ… అందరి సలహాలు, సూచనలు తీసుకుని పార్టీ నిర్మాణం చేస్తా. స్టేట్‌లో బీజేపీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తా.

రాష్ట్రంలో ప్రతిపక్షాల ఉనికే లేదన్నట్టుగా ఉంది కదా..?

సంజయ్: టీఆర్ఎస్ పార్టీ స్వార్థ పూరిత రాజకీయాలు చేస్తోంది. అహంకారంతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోంది. అమరవీరుల ఆశయాలను ఆత్మబలిదానాలను నిర్వీర్యం చేసింది. ప్రజాస్వామిక తెలంగాణ కావాలన్న ఆశయంతో ప్రజలు ఉన్నారు. వీరి ఆశయాలకు అనుగుణంగా, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు కోసం బీజేపీ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టేందుకు ముందుకు వస్తోంది.

రాష్ట్రంలో కమల వికాసానికి మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది..?

సంజయ్: అబద్ధాలతో నెరవేర్చలేని హామీలు ఇస్తూ టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది. ప్రజా వ్యతిరేక అహంకార పూరిత పరిపాలనకు వ్యతిరేకంగా పార్టీ కేడర్‌ను కార్యోన్ముఖులను చేస్తాం. రానున్న ఎన్నికల్లో కమలం వికసించే విధంగా మా కార్యాచరణ ఉండబోతోంది.

అమిత్ షా లక్ష్యం తెలంగాణాలో అధికారం అన్నట్టుగానే ఉంది కదా.. మీరెలాంటి కార్యక్రమాలు తీసుకోనున్నారు?

సంజయ్: రాష్ట్రంలో బీజేపీ శక్తివంతంగా ఉంది. గ్రామస్థాయి, బూత్ స్థాయి కమిటీలతో పార్టీ బలంగా ఉంది. అందువల్లే రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలు గెల్చుకోగలిగాం. మునిసిపల్ ఎన్నికల్లో కూడా గతంలో కంటే ఓటింగ్ శాతం పెరిగింది. ఇదే స్పూర్తితో ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు కాబట్టి వారి ఆలోచనలకు అనుగుణంగా పటిష్ఠం చేయడం కోసం పనిచేస్తా. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించనున్నాం. కేంద్ర పథకాల పేర్లు, ఫోటోలు మార్చి రాష్ట్ర పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోన్న విషయాన్ని సైతం ప్రజలకు వివరించనున్నాం.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపబోతోంది..?

సంజయ్: భారతీయ జనతా పార్టీ శక్తివంతమైన పార్టీగా ఎదిగినందునే టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అవలంభిస్తోంది. మొన్నటివరకు నిక్కచ్చిగా వ్యవహరించిన ముఖ్యమంత్రికి జీహెచ్ఎంసీ ఎన్నికలు గుర్తుకురావడంతో.. బీజేపీ బలోపేతం అవుతుందని, ప్రధాని మోడీ గ్రాప్ పెరిగిపోతోందని, తెలంగాణ ప్రజలు మోడీ వైపు చూస్తున్నారని గుర్తించి మైనార్టీ ఓట్ల ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అందువల్లే సీఎం కేసీఆర్ కరోనా వైరస్ నిరోధించే విషయంలో ద్వంద్వ విధానాలు అవలంభించే స్థితికి దిగజారారు. లాక్‌డౌన్ అన్నివర్గాల ప్రజలకన్న విషయాన్ని విస్మరించి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అన్ని మతాలను సమానంగా చూడాలి, వారిని కాపాడాలన్న ఆశయం ప్రభుత్వానికి ఉండాలి కాని సాక్షాత్తు ముఖ్యమంత్రే స్పందించడం లేదు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఇలా చేస్తున్నారు.

కరోనాపై ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయనుకుంటున్నారు..?

సంజయ్: కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. గద్వాలలో చనిపోయిన వ్యక్తి శాంపిల్ సేకరించి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల వేలాది మంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో కరోనా వ్యాధి ప్రబలి చాలామందికి సోకింది. చనిపోయిన వారి శాంపిల్స్ తీసుకోని పరీక్షలు చేయవద్దన్న నిర్ణయం తీసుకున్నారంటే అంతకన్నా సిగ్గుచేటైన చర్య మరోటి లేదు. గద్వాల, సూర్యాపేట, వికారాబాద్‌లో ఏకధాటిగా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే సెంట్రల్ టీం వస్తోందని టెస్ట్‌లను ఆపేశారంటే దేనికోసం రాష్ట్ర ప్రభుత్వ తాపత్రయపడుతుందో ఒకసారి ఆలోచించాలి. చనిపోయిన వారి వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించలేని పరిస్థితిలో ఉంది. కేంద్రం ప్రకటించిన వివరాలకు, రాష్ట్రం ప్రకటించే వివరాలకు పూర్తి తేడా ఉంది. చాలా ప్రాంతాల్లో చనిపోయిన వారి విషయంలో కానీ పాజిటివ్ కేసుల విషయంలో కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ వ్యవహారశైలి వల్లే ప్రజల్లో సీరియస్ నెస్ తగ్గింది.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో తరుగు, తాలు పేరిట కోత విధిస్తుండండంపై మీ కామెంట్?

సంజయ్: ప్రభుత్వానికి రైతు పాలసీ లేదు. కేవలం పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిగింజా కొంటం, కొనుగోలు కేంద్రాలు పెంచినం, కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయని సీఎం చెప్పారు. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని రైతులు అడగడం లేదు, కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుకుంటున్నారు. మద్దతు ధర కావాలని అడుగుతున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. తరుగు పేరిట క్వింటాలుకు 8 నుండి 10 కిలోల తరుగు తీస్తున్నారు. ఓ ప్రాంతంలో టోకెన్ సిస్టం, మరో ప్రాంతంలో డ్రా సిస్టం అంటున్నారు. చివరకు రైతు కేంద్రానికి ధాన్యం తరలించిన తరువాత నిబంధనలు మార్చి వెనక్కి తీసుకెళ్లాలని హెచ్చరిస్తున్నారు. ఒక్కో కొనుగోలు కేంద్రం ఒక్కో రకంగా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

కష్టపడి పండించిన పంటను రైతులే దగ్దం చేస్తున్నారంటే, లాక్‌డౌన్‌ను ధిక్కరించి రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే వారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం మూర్ఖంగా ఆలోచిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో వడగళ్ల వాన పడి నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదు. ఇప్పుడు అకాల వర్షంతో నష్టపోయిన పంటలను అంచనా వేస్తున్నామని ప్రభుత్వం హంగామా చేస్తోందే తప్ప రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు. మంచి జరిగితే తన ఖాతాలో వేసుకునే ముఖ్యంమంత్రి చెడు జరిగితే కేంద్రంపై నెట్టేస్తారు. ఓ మంత్రి ధాన్యం కొనుగోళ్లు కొనే బాధ్యత కేంద్రానిదే అంటే, ముఖ్యమంత్రి ప్రతి గింజా కొంటామని ప్రకటిస్తే, మరో మంత్రి ధాన్యం మొత్తం కూడా రాష్ట్రమే కొంటుంది, కేంద్రానికి సంబంధమే లేదంటారు. ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. కేంద్రం అన్ని చేశాక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు..? ముఖ్యమంత్రి ఎందుకు? రాష్ట్రానికి అన్ని ప్రధానే చూసుకుంటారు కదా.

Tags: bjp, bandi sanjay, amit shah, kcr, trs, telangana, ghmc, elections, corona, covid 19

Next Story

Most Viewed