బండి.. రాజకీయాల్లో కొట్టిన పిండి

by  |
బండి.. రాజకీయాల్లో కొట్టిన పిండి
X

దిశ, కరీంనగర్: బంతిని ఎంత కొడితే అంత పైకి లేస్తుందనడానికి ఆయన ఓ ఉదాహరణ. అణచివేతల నుంచి అధ్యక్షపీఠమెక్కిన బండి సంజయ్ రాజకీయాన్ని విశ్లేషిస్తే ఈ విషయమే అవగతం అవుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ప్రస్థానం మొదటగా ఆర్ఎస్ఎస్ నుంచి స్టార్ట్ అయ్యింది. స్వయం సేవకుడిగా, యువమోర్చ నాయకుడిగా బీజేపీకి ప్రమోట్ అయిన సంజయ్ మొదట్నుంచి అణచివేతను ఎదిరిస్తూ ఉన్నతస్థానానికి ఎదిగారు. జిల్లాలో సీనియర్లు పక్కన పెట్టినా స్టేట్‌లో అత్యున్నత స్థానాన్ని అధిష్ఠించారు.

బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన సంజయ్‌ను పక్కనపెట్టే ప్రయత్నం చేసినా బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యునిగా పదవి దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజాక్షేత్రంలో పట్టు నిరూపించుకోవాలని డిసైడై ఎన్నికల్లో గెలిచి కరీంనగర్ బల్దియాలో అడుగుపెట్టారు. కార్పొరేటర్‌గా రెండుసార్లు, అంతకుముందు కో అపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో రెండుసార్లు డైరక్టర్‌ అయ్యారు. యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. చైతన్యపురిలో మహాశక్తి ఆలయం నిర్మించి భక్తిమార్గంలో అన్నివర్గాల్లో పట్టు నిలుపుకున్నారు. రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు.

సంజయ్ అందర్నీ కలుపుకొని పోవట్లేదని, సీనియర్స్‌ను పక్కన పెడుతున్నారని హైకమాండ్‌కు ఫిర్యాదుల పరంపర కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో సంజయ్ పోటీ చేయడం ఎంపీగా గెలవడం చకచకా జరిగిపోయింది. అయినప్పటికీ సంజయ్‌పై ఆరోపణలు చేస్తూ కొందరు ఆయన ఎదుగుదలకు బ్రేకులు వేసే ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది. ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా కరీంనగర్ టూర్‌ను చివరి నిమిషంలో రద్దు చేయించడంలో కూడా సంజయ్ ఎదుగుదలను నిలువరించే వారు ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారని చర్చ సాగింది. చివరకు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపికలో సంజయ్ తప్పటడుగులు వేశారంటూ ఆరోపణలు చేశారు. అనూహ్యంగా 13 మంది బీజేపీ కార్పొరేటర్లు గెలవగా కొందరు తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. దీంతో సంజయ్ కావాలనే టీఆర్ఎస్‌తో చేతులు కలిపి గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వలేదన్న నింద ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలోనే సంజయ్ ఎవరిపై కామెంట్ చేయకుండా తన పని తాను చేసుకు పోయారు. సిరిసిల్లలో ఇసుక లారీల దగ్ధం కేసులో పలువురిని పోలీసులు చితకబాదిన విషయాన్ని జాతీయస్థాయి అంశంగా చేయడంలో సంజయ్ మొండి ధైర్యమనే చెప్పాలి. జయశంకర్ జిల్లాలో దుప్పుల వేట ఘటనను కిషన్ రెడ్డికి చెప్పి అటవీ ప్రాంతంలో జరుగుతున్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేశారు. దీంతో సీనియర్లకు మింగుడుపడని పరిస్థితే తయారైంది. ఇదే టైంలో సంజయ్ పేరు రాష్ట్ర అధ్యక్షునిగా జాతీయ నాయకత్వం ఆలోచించడం మొదలు పెట్టడంతో మళ్లీ సీనియర్లు ఢిల్లీ స్థాయిలో పావులు కదిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి సంజయ్‌ని వరిస్తుందా లేదా అన్న ఊగిసలాట జరిగినా చివరకు జాతీయ నాయకత్వం సంజయ్ వైపే మొగ్గు చూపింది.

Tags: Bandi Sanjay, Telangana, BJP President, Karimnagar MP, Seniors, Amit Shah, State BJP High Command, Kishan Reddy, Sircilla

Advertisement

Next Story