టెక్కలిలో తెలుగు తమ్ముళ్ల ఆవేదన తీరేదెలా??

by srinivas |   ( Updated:2020-08-05 10:12:10.0  )
టెక్కలిలో తెలుగు తమ్ముళ్ల ఆవేదన తీరేదెలా??
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్టుతో శ్రీకాకుళం తమ్ముళ్లలో పెద్దదిక్కు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన అరెస్టు తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలు కూడా చప్పగా ముగిశాయి. అదే ఆయనుంటేనా… అచ్చెన్న గర్జించేవారు… అంబటి రంకెలేసేవారు, రాజేంద్రనాథ్ వాయిస్ పెంచేవారు… సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ముసిముసి నవ్వులు పూయించేవారు. సభలో హాట్ హాట్ గా, గట్టి గట్టిగా చర్చలు సాగేవి. లైవ్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా రంజుగా ఉండేది. కానీ ఏం చేస్తాం…? అచ్చెన్న అరెస్టాయె, సభ చల్లారే, ముసిముసి నవ్వులు మూగబాయే… ప్రేక్షకులు నిట్టూరుచే…!

జూన్ 12 తెల్లవారుజామున ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఎసిబి అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసారు. గోడ దూకి మరీ ఆయనను అరెస్టు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనపై మండిపడ్డ టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగుల వ్యవహారంలోనూ, ఇంగ్లీష్ మీడియం చదువుల వ్యవహారంలోనూ వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రజలను ఈ అంశం నుండి డైవర్ట్ చేసేందుకే ఆయనను కుట్ర పన్ని ఈ కుంభకోణంలో ఇరికించారంటూ అధికార ప్రభుత్వంపై తెలుగు తమ్ముళ్లు దుమ్మెత్తిపోశారు.

బెయిల్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అచ్చెన్న ఇంకా జైలులోనే ఉన్నారు. అభిమానులు ప్రేమగా పిలుచుకునే టెక్కలి పులి నియోజకవర్గంలో లేకపోవడంతో టెక్కలి క్యాడర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పెద్దాయన ఉంటే టెక్కలిలోనే కాదు శ్రీకాకుళం జిల్లా టీడీపీ శ్రేణులందరికీ ఎనలేని ధైర్యం. ఆయన అరెస్టు తర్వాత స్వయంగా నారా లోకేష్ నిమ్మాడకు వెళ్లి వారి కుటుంబానికి, ఆయన అభిమానులకి ధైర్యం చెప్పి వచ్చారు. కానీ రెండు నెలలవుతున్నా ఆయనను జైలు నుండి బయటకు రప్పించడంలో విఫలమయ్యారు. దీంతో క్యాడర్ లో కలవరం మొదలైందని స్థానిక రాజకీయ వర్గాల సమాచారం.

నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఆపద వస్తే ఏ సమయంలో అయినా వాలిపోయేవారని, ఆందోళనలు, ధర్నాలతో కావాల్సింది సాధించి తెచ్చేవారు. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా కార్యకర్తలకు కొండంత అండగా ఉండేవారు. తరచూ నియోజకవర్గస్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేవారు. ఆయన లేకపోవడంతో పెద్ద దిక్కు లేనట్టు ఉందని తమ్ముళ్లు వాపోతున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు కుడిభుజంలా ఉండే అచ్చెన్న లాంటి ముఖ్యనేత అరెస్టుతో రాష్ట్ర స్థాయిలో పార్టీ తరపున గట్టిగా గళం వినిపించే నాయకుడు కనపడటం లేదని సర్వత్రా టాక్. ఆయన అరెస్టు తర్వాత జిల్లా పార్టీ శ్రేణులు, బీసీ నేతలు కూడా రెండు మూడు నిరసనలు చేపట్టి సైలెంట్ అయ్యారు. ఆయన బయటకి వచ్చేవరకు జూనియర్ శ్రీకాకుళం టైగర్ ఎంపీ రాంమోహన్ నాయుడు అండగా నిలుస్తారులే అనుకుంటే ఆయన కూడా కరోనా క్వారంటైన్ లో ఉంటున్నారు. బాబాయి రిలీజ్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న మాట. ఎవరు ఎన్ని చేసినా, ఎంత ధైర్యం చెప్పినా ఆయన లేని లోటు లోటే… టెక్కలి పులి బయటకి వస్తేనే మాకు అభయం అంటున్నారు క్యాడర్.

Advertisement

Next Story