ఫుడ్ వేస్టేజ్‌‌పై అవగాహన కోసం ‌‘మ్యాంగో డ్రెస్’!

by Shyam |
ఫుడ్ వేస్టేజ్‌‌పై అవగాహన కోసం ‌‘మ్యాంగో డ్రెస్’!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్‌కు చెందిన 18ఏళ్ల జెస్సికా కొలిన్స్.. ఇటీవలే ఇంటర్ (12వ తరగతి) కంప్లీట్ చేసి మామిడి పండ్ల సప్లయర్‌గా తమ హోమ్ బిజినెస్‌లో రాణిస్తోంది. అయితే తినడానికి పనికొచ్చే పండ్లను సూపర్ మార్కెట్లు తిరస్కరించడంతో ఏటా లక్షలాది మామిడి పండ్లు వృథాగా పోతున్నాయని గ్రహించిన కొలిన్స్.. ఆహార వృథాపై అవగాహన కల్పించేందుకు 14 వందల మామిడి పండ్లతో ఫ్యాన్సీ డ్రెస్ తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటోంది.

జెస్సికా కొలిన్స్‌కు ఆస్ర్టేలియాలో పెద్ద మామిడి తోట ఉండగా.. తన పేరెంట్స్ ఫార్మ్‌లో పండిన మామిడి పండ్లను ఆస్ట్రేలియాలోని సూపర్ మార్కెట్లతో పాటు ఇతర మార్కెట్లకు సప్లయ్ చేస్తుంటారు. కాగా చిన్నప్పటి నుంచి ఆ తోటలోనే పెరిగిన జెస్సికా.. ఇప్పుడు మామిడిపండ్ల బిజినెస్‌లోనూ పేరెంట్స్‌కు హెల్ప్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాము సప్లయ్ చేసే మామిడి పండ్లలో కొన్ని మాత్రం ప్రమాణాలకు తగినట్లు లేవంటూ సూపర్ మార్కెట్లు తిప్పిపంపుతుండటంతో ఏటా 5 టన్నుల మామిడి పండ్లు వృథా అవుతున్నాయని గ్రహించింది. ఎంతో కష్టపడి, అన్ని ప్రమాణాలు పాటించి పండించిన మామిడి పండ్లను వృథా చేయడం ఇష్టం లేని జెస్సికా, దానిపై అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ‘మ్యాంగో సీడ్స్ డ్రెస్’కు రూపమిచ్చింది. ఇందుకోసం1400 మామిడి సీడ్స్‌ను ఉపయోగించింది. డ్రెస్ కోసం నాలుగు నెలల కష్టపడిన జెస్సికా, భవిష్యత్తులో మ్యాంగో సీడ్స్‌ను ఫైబర్ కాటన్‌లా ఉపయోగించే రోజులొస్తాయని అంటోంది. ఇప్పుడు జెస్సికా రూపొందించిన మ్యాంగో డ్రెస్ చూసినవారంతా ఆమెను అభినందిస్తున్నారు. సస్టెనిబిలిటీని ఫ్యాషన్‌కు మేళవించిన తీరు అద్భుతమని జెస్సికాను కొనియాడుతున్నారు.

‘సూపర్ మార్కెట్లు తిరస్కరిస్తున్న పండ్లన్నీ కూడా మంచివే, వాటిని ప్రజలందరూ నిరభ్యంతరంగా తినొచ్చు. ఫామ్‌లోని పండ్లన్నీ కూడా ఒకే రకంగా పెంచుతాం. కొన్ని మాత్రమే టెస్టింగ్ పాస్ కావడం మిగతావి ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం ఎలా జరుగుతుంది. సూపర్ మార్కెట్లు అనుసరిస్తున్న తీరు వల్ల ఇలా జరుగుతున్నందున ఆ వృథాను అరికట్టడంతో పాటు దానిపై అందరిలోనూ అవగాహన తీసుకురావడానికి మ్యాంగో డ్రెస్‌ డిజైన్ చేశాను. ఇక్కడ పండ్లనే కాదు, ఆహారాన్ని వృథా చేయడమూ కరెక్ట్ కాదు. ఇక నా కెరీర్ విషయానికి వస్తే.. నాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నేను నర్సింగ్ చేయాలనుకున్నాను. అయితే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా ఇష్టమే. రాబోయే రోజుల్లో సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్ట్స్ చేస్తాను’ అని జెస్సికా తెలిపింది.

Advertisement

Next Story