మూడో టీ20లో భారత్ ఓటమి.. ఇంగ్లాండ్‌దే సిరీస్

by Shyam |
మూడో టీ20లో భారత్ ఓటమి.. ఇంగ్లాండ్‌దే సిరీస్
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మహిళల జట్టు ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-2 తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు మ్యాచ్ డ్రా చేసుకున్న ఇండియా.. ఆ తర్వాత వన్డే సిరీస్, టీ20 సిరీస్ కూడా ఓడిపోయింది. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఛెమ్స్‌ఫోర్డ్‌లో నిర్ణయాత్మక మూడో టీ20 జరిగింది. టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ చేసింది. కేవలం 13 పరుగులకే కీలకమైన షెఫాలీ వర్మ (0), హర్లీన్ డియోల్ (6)వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ కలసి నాలుగో వికెట్‌కుకీలకమైన 68 పరుగులు జోడించారు. మంధాన, హర్మన్ కలసి ధాటిగా ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కున్నారు.

మంచి దూకుడుమీద ఉన్న హర్మన్ ప్రీత్ (36) నాట్ షివర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. స్నేహ్ రాణా (4) మరో సారి విఫలమైంది. అయితే మంధాన (70) ధాటిగా ఆడి అర్ద సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా పరుగులు రాబట్టింది. కేథరిన్ బ్రంట్ బౌలింగ్‌లో మంధాన (70) నాట్ షివర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యింది. రిచా ఘోష్ (20) చివర్లో మెరుపులు మెరిపించింది. దీంతో నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఇక 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే టామీ బ్యూమౌంట్ (11) వికెట్ కోల్పోయింది. అయితే డానీ వాట్ (89), నాట్ షివర్ (42) కలసి ధాటిగా ఆడారు. వీరిద్దరూ కలసి భారత బౌలర్లను చితక బాదారు. ముఖ్యంగా వాట్ బౌండరీలతో స్కోర్ బోర్డును వేగంగా పరుగులెత్తించింది.

ఆమెకు నాట్ షివర్ తోడుగా నిలిచింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 112 పరుగులు జోడించారు. చివర్లో నాట్ షివర్ అవుటైనా.. మరో వికెట్ పడకుండా వాట్, హీథర్ నైట్ (6) లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్నది. డానీ వాట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, నాట్ షివర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. భారత జట్టు వరుసగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లపై వన్డే, టీ20 సిరీస్‌లు కోల్పోయింది.

ఇండియా 153/6
ఇంగ్లాండ్ 154/2

Advertisement

Next Story