ఉపఎన్నిక బరిలో టీడీపీ.. బాస్ క్లియరెన్స్ ఇచ్చేనా..?

by Sridhar Babu |   ( Updated:2021-09-30 00:27:52.0  )
ఉపఎన్నిక బరిలో టీడీపీ.. బాస్ క్లియరెన్స్ ఇచ్చేనా..?
X

దిశప్రతినిధి, కరీంనగర్ : బొటాబోటి కేడర్‌తో ఉన్నామా లేమా అన్న పరిస్థితికి చేరిన ఆ పార్టీ మాత్రం తన సత్తా ఏంటో చాటాలనుకుంటోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, నామ్ కే వాస్‌గా మిగిలిన ఆ పార్టీకి లీడర్ల కొరత కూడా తీవ్రంగానే ఉంది. అయినా బరి గీసి కొట్లాడుడే అని గర్జిస్తోంది.

గతమెంతో గణకీర్తిని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ స్వరాష్ట్ర కల సాకారం తరువాత తెలంగాణలో నామమాత్రంగానే మిగిలింది. అక్కడక్కడ మిగిలిన కేడర్‌తో సరిపెట్టుకుంటున్న టీడీపీ తన బలాన్ని ప్రదర్శించేందుకు సాహసిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని టీడీపీ కరీంనగర్ పార్లమెంటరీ ఇంచార్జి జోజిరెడ్డి ప్రకటించారు. అయితే, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు అంతగా లేని తెలుగుదేశం పార్టీ బరిలో నిలవడం వల్ల ఆ పార్టీకి లాభం చేకూరుతుందా లేదా అన్నదే మిస్టరీగా మారింది. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే అయినప్పటికీ దుస్సాహసం చేయాలని భావిస్తోందా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలోనూ తెలుగు తమ్ముళ్ల ఉనికి అంతంత మాత్రమే. కేడర్, లీడర్ లేకుండా పోయినా ఈ సమయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

బాస్ క్లియరెన్స్..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హుజురాబాద్‌లో పోటీ చేసేందుకు క్లియరెన్స్ ఇస్తారా లేదా అన్నది అంతుచిక్కకుండా పోయింది. మూడు నెలల క్రితమే జిల్లా నాయకత్వం ఈ ప్రతిపాదనను చంద్రబాబు ముందు పెట్టినప్పటికీ ఆయన నుండి ఎలాంటి సంకేతాలు రాలేదు. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం పోటీ చేస్తామన్న అభిప్రాయాలు ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటుందా? లేదా అన్నది కష్టమేనని స్పష్టం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed