ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?.. వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

by srinivas |
sambasiva rao
X

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ రానీ, ఒమిక్రాన్ కేసులు పెరగనీ ఎవరెలా చస్తే నాకేంటి అన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైనా ముఖ్యమంత్రిలో ఎలాంటి చలనం లేకపోవడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘ఇప్పటికే తన అసమర్థత, చేతకానితనంతో కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగా దేశంలోనే రోజువారీ కేసుల నమోదులో 5వ స్థానంలో వ్యాక్సినేషన్ లో 10వ స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. కరోనా పరీక్షలు, టీకా పంపిణీలో రికార్డులు సృష్టించామని ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తోంది. చాలా చోట్ల రెండో డోసు వేయకుండానే వేసినట్టు మెసేజ్‌లు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడంలేదు? రోజువారీ ప్రభుత్వ బులిటెన్లలో వ్యాక్సిన్ వివరాలు ఎందుకు పొందుపరడం లేదు? 2022, జనవరిలో ఒమిక్రాన్ తీవ్రం కావచ్చని, వైద్య వ్యవస్థపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేక రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్న దుస్థితికి ఈ ప్రభుత్వం కారణం కాదా? యువతను నాశనం చేసే గంజాయి అమ్మకాలు ఎలా పెంచాలి, జనాన్ని మద్యం మత్తులో ఎలా ముంచాలి, పన్ను పోటుతో మధ్య తరగతి రక్తం ఎలా పీల్చాలి అనే అంశాలపై ప్రతిరోజూ సమీక్షా సమావేశాలు నిర్వహించే ముఖ్యమంత్రికి ఒమిక్రాన్ తీవ్రతపై సమీక్షించే తీరక లేదా? అవినీతి సొమ్ముతో గల్లా పెట్టె నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై ఎందుకు లేదు?’ అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు.

‘విదేశీయులు నుంచి ఒమిక్రాన్ రాకుండా పొరుగు రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యల్లో పరుగులు పెడుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపడంపైనే దృష్టి పెడుతోంది. ప్రతిరోజూ మన రాష్ట్రానికి 2,500మందికి పైగా విదేశీయులు వస్తుండగా వారికి ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహించే వ్యవస్థే మన దగ్గర లేదంటే వైద్య ఆరోగ్యశాఖ ఎంత వైఫల్యం చెందిందో అర్థం చేసుకోవచ్చు. విమానాశ్రయాల్లో కేవలం ఒక్కో మెడికల్ టీమ్‌నే ఏర్పాటుచేసి చేతులు దులిపేసుకున్నారు. విదేశీ ప్రయాణికుల టెస్ట్ రిపోర్ట్ తేల్చే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంలో జాప్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? మరోవైపు కొవిడ్ మృతుల కుటుంబాలకు అందించే రూ.50,000 పరిహారానికి వైసీపీ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. బాధితులు ఇచ్చే దరఖాస్తులకు మునుపెన్నడూ లేని ఆంక్షలు పెట్టడంతో మొత్తం పరిహార ప్రక్రియే ప్రహసనంగా మార్చేశారు. కిందిస్థాయిలో డెత్ సర్టిఫికెట్ కావాలంటే రూ.10 వేలు డిమాండ్ చేస్తున్న ఘటనలూ వెలుగు చూస్తున్నా వైద్యశాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన నిర్లక్ష్యం వీడి ఒమిక్రాన్ కేసులు నమోదు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజలు తిరగబడి తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడించడం ఖాయమని’ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed