డీజీపీ ఆఫీస్ ఎదుట చంద్రబాబు బైఠాయింపు

by srinivas |   ( Updated:2020-03-12 01:19:28.0  )
డీజీపీ ఆఫీస్ ఎదుట చంద్రబాబు  బైఠాయింపు
X

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. బుధవారం గుంటూరు మాచర్లలో టీడీపీ ముఖ్య నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ఈ క్రమంలో విజయవాడలో డీజీపీ కార్యాలయం ఎదుట చంద్రబాబు, టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్న, హైకోర్టు అడ్వొకేట్ కిశోర్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ చంద్రబాబు, టీడీపీ నేతలు డీజీపీ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. డీజీపీని కలిసేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు. చంద్రబాబుతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బోండా ఉమా కూడా రోడ్డు మీద బైఠాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి 5 కిలోమీటర్లకు వైసీపీ నేతలు స్థానికంగా సమాచారం ఇస్తూ తమ మీద దాడి చేశారని ఆయన ఆరోపించారు. దీంతో అడ్వకేట్ కిశోర్ నాగార్జున సాగర్ మీదుగా తెలంగాణలోకి పారిపోవాల్సి వచ్చిందన్నారు. అలాగే, టీడీపీ నేతలను కాపాడిన పోలీసుల మీద కూడా వైసీపీ గూండాలు దాడి చేశారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఏకంగా పోలీసుల మీద దాడులు చేస్తున్నా డీజీపీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చెప్పుకోడానికి కూడా అవకాశం దొరకని డీజీపీ మన రాష్ట్రంలో ఉన్నారు. పోలీసులకే రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ కల్పిస్తారని, పోలీసులే గుండాలను పెంచిపోషిస్తే ఇలాగే ఉంటుంది’ అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Tags: AP DGP office, TDP leader chandrababu nayudu, fire, ycp leaders, protest, YCP attack, bonda uma, buddha venkanna

Advertisement

Next Story

Most Viewed