కాకి లెక్కలు.. కావు, కావు!

by Shyam |   ( Updated:2020-02-13 02:57:19.0  )
కాకి లెక్కలు.. కావు, కావు!
X

నిధులు నిప్పులు కురిపిస్తున్నాయి. వైరాన్ని వార్‌గా మారుస్తున్నాయి. పచ్చనోట్లు ప్రచ్ఛన్నయుద్ధానికి తెరతీస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డ వేయకున్నా భగ్గుమంటోంది. కాకి లెక్కలుకాదు బాకీ లెక్కలు చెప్పమంటోంది తెలంగాణ. వాటా కోసం ఘర్షణబాట పట్టింది కేసీఆర్ సర్కార్. లెక్క లెక్కేనంటోంది కేంద్రం. లెక్క తప్పులేదు, లెక్క తప్పలేదంటోంది మోదీ ప్రభుత్వం.
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సహకార సమాఖ్య స్ఫూర్తి కొరవడిందంటూ తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంగా కేంద్రంపై నిప్పులు చెరుగుతోంది. తెలంగాణకు రావాల్సిన వాటా ప్రకారం నిధుల విడుదల కావడంలేదంటూ ఆరోపిస్తోంది. కేంద్రం ఇచ్చేది తక్కువగా, తీసుకుంటోంది ఎక్కువ అని ఆరోపణలు మొదలయ్యాయి. కేంద్రాన్నిసాకుతోందే రాష్ట్రాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం అదే పాట పాడుతున్నారు. రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపేణా కేంద్రం తీసుకుంటున్నదాంట్లో సగం కూడా తిరిగి రాష్ట్రానికి ‘డివల్యూషన్’ పేరుతో ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం నుంచి ఇచ్చిన లెక్కలను చెప్పాల్సిందిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమిత్‌షాను సైతం కేసీఆర్ సవాల్ చేశారు. ఇప్పుడు అది కేటీఆర్ వంతయింది.

గడచిన లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి కేంద్రానికీ, రాష్ట్రానికి మధ్య రాజకీయ వార్ నడుస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీని ఇరుకున పెట్టడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉంది. లోక్‌సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వడంతో రాష్ట్రానికి మరో అవకాశం లభించినట్లయింది. దాన్ని ఆధారంగా తీసుకుని కేటీఆర్ లెక్కల చిట్టా విప్పారు. రాష్ట్రం నుంచి కేంద్రం గడచిన ఐదేళ్ళలో రూ. 2.72 లక్షల కోట్లను వివిధ పన్నుల రూపంలో తీసుకుందని, కానీ తిరిగి రాష్ట్రానికి ఇచ్చింది మాత్రం కేవలం రూ. 1.12 కోట్లు మాత్రమేనని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు. ఇంకా రూ. 1.60 లక్షలు కేంద్రం దగ్గరే పెండింగ్‌లో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలకు, రాష్ట్రం చెప్తున్న లెక్కలకు మధ్య పొంతన లేకపోవడంతో కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ వాస్తవిక లెక్కలను రాబట్టే ప్రయత్నం చేశారు. దాని ప్రకారం ఐదేళ్ళలో రాష్ట్రానికి రూ. 1.12 లక్షల కోట్లు ఇచ్చినట్లు తేలింది. గడచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమిత్ షా సైతం ఇదే తరహాలో లక్ష కోట్ల రూపాయలకంటే ఎక్కువే ఇచ్చామని ప్రచారసభలో చెప్పారు. కానీ ఆ లెక్క తప్పు అంటూ కేసీఆర్ ఘాటుగానే స్పందించారు. తప్పుడు లెక్కలతో రాష్ట్రంపై నింద మోపినందుకు తెలంగాణ గడ్డ మీద నుంచి వెళ్ళిపోకముందే క్షమాపణ చెప్పాల్సిందిగా కేసీఆర్ డిమాండ్ చేశారు. కానీ అలాంటి క్షమాపణ అమిత్ షా నుంచి రాలేదు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఏ పథకం కింద, ఏ పద్దు కింద తెలంగాణకు ఏ సంవత్సరం ఎంత చొప్పున ఇచ్చిందనే వివరాలను వెల్లడించారు. దాంతో తప్పుడు లెక్కలు చెబుతోందని కేంద్రంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన జీఎస్టీ బకాయిలు ఇంకా అందలేదని, వెంటనే చెల్లించాలంటూ కేసీఆర్ ఇటీవల లేఖ రాశారు. అదే సమయంలో 15వ ఆర్థిక సంఘం తన సిఫారసుల్లో ఇంతకాలం అమలైన 42% డివొల్యూషన్‌ను ఒక శాతం తగ్గించి 41%కి పరిమితం చేస్తామని కేంద్రానికి నివేదించింది. దీంతో తెలంగాణ మరింత నష్టపోతుందని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఇచ్చినదానికంటే రెండు రెట్లు ఎక్కువగానే కేంద్రం తీసుకుంటోందంటూ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కొత్త లెక్కలను ప్రస్తావించారు. రాష్ట్రం పొందుతున్నదానికంటే ఇస్తున్నదే ఎక్కువ అని కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీ మున్ముందు ఇంకెంత ముదురుతుందో వేచి చూడాల్సిందే!

Advertisement

Next Story