ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి భారీ పెట్టుబడులు..

by Harish |
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి భారీ పెట్టుబడులు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన సంస్థ టాటా మోటార్స్, ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ గ్రూప్ మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. టీపీజీ గ్రూప్ సంస్థ టాటా మోటార్స్ అనుబంధ ఎలక్ట్రిక్ విభాగంలో 1 బిలియన్ డాలర్ల(రూ. 7.500 కోట్ల) భారీ పెట్టుబడులు పెట్టనుంది. రాబోయే 18 నెలల కాలంలో దశల వారీగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ప్రస్తుతానికి భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాటా కంపెనీదే అగ్రస్థానం. దీన్ని మరింత పెంచేందుకు కంపెనీ అడుగులు వేస్తోంది.

‘దేశీయంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగంలో వినియోగదారులకు మరింత చేరువ కావడానికి టీపీజీ రైజ్ క్లైమేట్ సంస్థతో భాగస్వామ్యం సంతోషంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మరిన్ని పెట్టుబడులతో వినియోగదారులకు కావాల్సిన ఉత్పత్తులను తీసుకొస్తాం. భారత ప్రభుత్వం 2030 నాటికి మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా కనీసం 30 శాతం ఉండేలా ప్రణాళిక రూపొందించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గణనీయంగా ఈ విభాగంలో వాహనాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని’ టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్న్ చెప్పారు. దీంతో పాటు 2025 నాటికి దేశీయ మార్కెట్లో కొత్త 10 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకు రావాలని భావిస్తున్నట్టు అన్నారు.

Advertisement

Next Story