2039 నాటికి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహన తయారీ లక్ష్యం : జేఎల్ఆర్!

by Harish |
2039 నాటికి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహన తయారీ లక్ష్యం : జేఎల్ఆర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల గ్రూప్ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) సోమవారం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి ప్రణాళికలను వెల్లడించింది. 2039 నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసేందుకు లక్ష్యంగా ఉన్నట్టు ప్రకటించింది. టాటా మోటార్స్ అనుబంధంగా ఉన్న జేఎల్ఆర్ ‘రీ-ఇమాజైన్’ దిశగా వెళ్లేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయంగా కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్, ఇతర సాంకేతిక ఆధారిత తయారీ వైపు ప్రయాణిస్తున్న వేళ జేఎల్ఆర్ మరింత వేగవంతంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.

అదేవిధంగా, ల్యాండ్ రోవర్ రాబోయే ఐదేళ్లలో 6 పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లను తీసుకురానుంది. భవిష్యత్తులో జాగ్వార్ సంస్థ పూర్తిస్థాయిల్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. ఇక, పూర్తి ఎలక్ట్రిక్ తయారీ మోడల్‌ను 2024లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 2030 నాటికి 100 శాతం జాగ్వార్ కార్లు, 60 శాతం ల్యాండ్ రోవర్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా తీసుకురానున్నట్టు జేఎల్ఆర్ స్పష్టం చేసింది. కాగా, గత నెలలో మరో ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటోరస్ తన కొత్త కార్లు, ఎస్‌యూవీలు, లైట్ పిక్-అప్ ట్రక్కులు 2035 నాటికి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్నట్టు ప్రకటించినట్టు తెలిసిందే. సోమవారం నాటి టాటా మోటార్స్ ప్రకటన తర్వాత కంపెనీ షేర్ ధర 3 శాతం పెరిగి రూ. 332 కి చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed