‘లక్కీ’.. టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి!

by Shyam |
‘లక్కీ’.. టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి!
X

దిశ, నిజామాబాద్: వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లకు కోట్లు వెనుకబడుతున్నాయి. ఇది ఒక్కచోటే కాదు చుట్టుపక్కలల్లో కూడా ఇదే వైనం. ఎందుకంటే అందులో అసలు విషయం వేరే ఉంది. ఇది ఏడాది క్రితమే పురుడుపోసుకున్నది. కాకపోతే ఆ విషయం ఎవ్వరికీ తెలవదు. కాస్త లేటైనా కూడా ఇప్పుడు బయటపడింది. దీంతో అక్కడ అందరూ ఆందోళన చెందుతున్నారు. అదేందో మీరే చదవండి…

జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న లక్కీ డ్రా(లక్కీ లాటరీల) దందాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపడంతో సదరు ఎంటర్‌‌ప్రైజెస్‌లు నిర్వహిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిజామాబాద్‌లో లక్కీ డ్రా దందాల నిర్వహణలో ‘కీ రోల్’ పోషిస్తున్న ‘షైన్ ఎంటర్‌ప్రైజెస్‌’పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి వ్యవహారం.. అందులో సభ్యులుగా చేరిన వారికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎందుకంటే ఒక పక్క షైన్ ఎంటర్‌ప్రైజెస్‌లో నిజామాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వేలమందిని ఏజెంట్లు సభ్యులుగా చేర్చారు. తాజాగా పోలీసులు జరిపిన దాడి కారణంగా అసలు విషయం బయటపడినట్లయ్యింది. దీంతో తాము చెల్లించిన డబ్బులు తిరిగి వస్తాయా లేదా అనే ఆందోళన సంబంధిత సభ్యుల్లో షురువైంది.

ఏడాది కిందట జిల్లా కేంద్రంగా పురుడు పోసుకున్న ఎంటర్‌ప్రైజెస్‌ల మాటున ఈ లక్కీ డ్రా దందాలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. దాదాపు 25 ఎంటర్‌ప్రైజెస్‌ల నిర్వాహకులు ఈ దందాలో ఆరితేరారు. వర్ని, నవీపేట్, ఇందల్వాయి మండల కేంద్రాల్లో ఈ దందా వేళ్లూనుకుంది. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 30 వేల మంది బాధితులు వీరి వలలో చిక్కుకున్నారు. దీనికి స్థానిక పోలీసుల ఉదాసీన వైఖరే(కేవలం పిటీ కేసులతో సరిపెట్టడం) కారణంగా చెప్పొచ్చు. ఎంటర్‌ప్రైజెస్‌ల పేరిట ఫర్మ్‌లు రిజిస్టర్ చేయించి ఇతరత్రా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ లక్కీడ్రాల దందా వంద కోట్లకు చేరిందంటేనే ఏస్థాయిలో ఉందో చెప్పనవసరంలేదు.

ప్రతీనెలా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఫంక్షన్‌హాల్స్‌లో వందల మందిని పిలిచి లక్కీ డ్రా నిర్వహిస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తుతూమంత్రంగా పిటీ కేసులు నమోదు చేసి విమర్శలకు తావిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా నిజామాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో గత గురువారం ఒక్కరోజే రూ.10.50 లక్షలు పట్టుబడడం కలకలం రేపింది. బోధన్ రోడ్డులోని షైన్ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట నిర్వహిస్తున్న మూడు లక్కీ డ్రాలు (షైన్ ఎంటర్‌ప్రైజెస్‌, రాయల్ ఎంటర్‌ప్రైజెస్‌, ఇందల్వాయి మండల కేంద్రంలోని త్రిమూర్తి ఎంటర్‌ప్రైజెస్‌)లో మూడు నుంచి నాలుగున్నర వేల మంది సభ్యులు ఉన్నట్టు తెలిసింది. అంటే ఎంటర్‌ప్రైజెస్ టర్నోవర్ పదికోట్లు దాటిందనేది బహిరంగ రహస్యం. ఇక్కడ ఒక్కచోటే పదిన్నర లక్షల డబ్బు దొరికితే.. ఇక ప్రతీ నెల జిల్లాలోని 30 ఎంటర్‌ప్రైజెస్‌ల లెక్కలు తీస్తే.. ఈ దందా కోట్ల రూపాయల్లో ఉన్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

ప్రతీ నెలా నిర్వాహకులు 5, 10, 15, 20, 23 తేదీల్లో లక్కీ డ్రాలను నిర్వహిస్తున్నారు. రిజర్వు బ్యాంక్ సూచనల ప్రకారం నిర్వాహకులు ఎలాంటి డిపాజిట్లు చేయడంలేదు. దీంతో వారు ఎప్పుడైనా బోర్డు తిప్పే అవకాశం ఉంది. జిల్లాలో జరుగుతున్న లక్కీ డ్రాలకు బ్యాక్ బోన్‌గా ఉంటూ నడిపించేది అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలే. ఒకవేళ వారు గుట్టుచప్పుడు కాకుండా బోర్డు తిప్పితే మాత్రం పోలీస్ శాఖతో పాటు అధికార పార్టీ నేతలపై ప్రజలు దుమ్మెత్తి పోయడం ఖాయం. నిజామాబాద్ చుట్టుప్రక్కల విస్తరించిన లక్కీ డ్రా దందాలకు మూలమైన నిజామాబాద్‌లోని మిగతా దుకాణాలు మూతపడితే గానీ పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం రాదు.

మరి టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు కొనసాగుతాయో లేక ఇంతటితోనే ముగిస్తారా అనేది వేచి చూడాల్సిందే !

Tags: Nizamabad, task force police, Lucky draw, enterprises, Function halls

Advertisement

Next Story