పంద్రాగస్టు నాటికి 5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

by Shyam |
పంద్రాగస్టు నాటికి 5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
X

దిశ, న్యూస్​బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో పంద్రాగస్టు నాటికి ఐదు కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది. గురువారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్​ కమిషనర్​ అర్వింద్​ కుమార్ అర్బన్​ ఫారెస్ట్రి, ఔటర్​ రింగ్​ రోడ్డు ఉన్నతాధికారులతో హరితహారం కార్యక్రమంపై సమీక్ష ​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అర్బన్​ ఫారెస్ట్రి యంత్రాంగం నిర్వహించిన పనులు, వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కల వివరాలు, వాటి గణాంకాలను కమిషనర్​ అర్వింద్​ కుమార్​ సమీక్షించారు. హరితహారం కార్యక్రమం కింద హెచ్ఎండిఏకు ఈ ఏడాది ఐదు కోట్ల మొక్కల పెంపకం లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటికీ యాభై శాతం కూడా పూర్తి చేయకపోవడంపై కమిషనర్​ అసహనం వ్యక్తం చేశారు.

ఎవెన్యూ ప్లాంటేషన్​ ప్రాంతాలన్నీ ‘గ్రీన్​ వాల్స్​’ మాదిరిగా ఉండేట్లు ఇప్పటివరకు ఉన్న చెట్ల మధ్య స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పలురకాల సైజుల మొక్కలు నాటాలని ఆదేశించారు. హెచ్​ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్ల పరిధిలో ప్రజా ప్రతినిధులు, కమిషనర్ల సహకారంతో ట్రీ పార్కులు, యాదాద్రి మోడల్​ ప్లాంటేషన్లు, స్మృతివనాలలో లక్ష్యసాధనలో భాగంగా మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. హరితహారం లక్ష్యాలను అధిగమించేందుకు ఔటర్​ రింగ్​ రోడ్డు, హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​(హెచ్​జిసిఎల్​) పరిధిలో గ్రీనరీ బాధ్యతలను అర్బన్​ ఫారెస్ట్రీ నుంచి ఓఆర్​ఆర్​ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ సంతోష్​కు అప్పగించారు. ఓయూలో ప్లాంటేషన్​ పురోగతిపై కమిషనర్​అధికారుల నుంచి వివరణ కోరారు. యాదాద్రి మోడల్ ​(మియావాకి పద్దతి)లో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు వర్సిటీ పరిధిలో చిట్టడవులను తీసుకువస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరు నాటికి అర్బన్​ ఫారెస్ట్రీ విభాగం 2.5 కోట్ల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు నిర్వహించాలని కమిషనర్​ అర్వింద్​ కుమార్​ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed