తాజ్‌మహల్ సందర్శనకు రావొచ్చు

by Anukaran |   ( Updated:2020-09-09 08:24:39.0  )
తాజ్‌మహల్ సందర్శనకు రావొచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు ఆరు నెలల తర్వాత పర్యాటక ప్రదేశమైన తాజ్‌మహల్ ప్రాంతం తిరిగి పర్యాటకులతో కళకళలాడనుంది. కొవిడ్-19 వైరస్‌ను నియంత్రించేందుకు ఈ ఏడాది మార్చిలో పర్యాటక ప్రదేశం తాజ్ మహల్ సందర్శనను ప్రభుత్వం నిలిపేసింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 200కి పైగా చారిత్రక కట్టడాలను, భవనాలను సందర్శించకుండా మూసేశారు. దీంతో దేశ పర్యాటక రంగానికి కోలుకోలేని నష్టం వాటిల్లింది.

అయితే, తాజాగా పర్యాటక ప్రాంతాలను మళ్లీ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 6 నెలల పాటు తాజ్ మహల్ సందర్శనను మూసేసిన తర్వాత సెప్టెంబర్ 21 నుంచి ప్రజల సందర్శనార్థం తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజ్‌మహల్‌తో పాటు ప్రఖ్యాత కట్టడాలైన ఎర్రకోట, ఆగ్రా కోటను కూడా సెప్టెంబర్ 21 నుంచే తెరవాలని భావిస్తోంది. ఇక, కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యాటక ప్రదేశాల సందర్శనం కోసం రోజుకు మొత్తం 5000 మందికి మాత్రమే పరిమితం చేయనున్నారు.
తాజ్‌మహల్ సందర్శనకు 2500 మంది, ఆగ్రా కోట సందర్శనానికి 2500 మందిని అనుమతించనున్నట్టు ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ చెప్పారు. తాజ్‌మహల్, ఆగ్రా కోట సందర్శనకు వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్కులను ధరించడం వంటి ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అయన తెలిపారు. టికెట్ కావాల్సినవారు ఆన్‌లైన్ పోర్టల్‌లో కొనుగోలు చేయవచ్చని చెప్పారు. కాగా, చారిత్రక ప్రదేశాల సందర్శనకు అనుమతిచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభించాలని ఆగ్రా టూరిస్ట్ వెల్ఫేర్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రహ్లాద్ అగర్వాల్ కోరారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed