తియ్యటి రుచులతో.. పొత్తు కడదాం!

by Sujitha Rachapalli |   ( Updated:2020-06-30 00:58:12.0  )
తియ్యటి రుచులతో.. పొత్తు కడదాం!
X

సినిమా మధ్యలో ఇంటర్వెల్ కార్డు పడగానే.. అడుగులు ఆటువైపే! షాపింగ్ మాల్‌లో కాలుపెట్టే ముందు.. ఆ రుచి చూడాల్సిందే! బడి గంట కొట్టగానే.. పిల్లలంతా ఆ బండి చుట్టే! జల్లింత జాములో.. చలి గిలిగింతల వేళలో.. దానితో పొత్తు కూడాల్సిందే! ఇంతకీ ఏంటంటారా? అదే.. తీపి రుచుల ‘స్వీట్‌కార్న్’. విదేశాల్లో ఆహా అనిపించి.. మన నగర ప్రజలతో లొట్టలేయించి.. పల్లెల్లోనూ పాగా వేస్తుంది. ఆ స్వీట్ స్వీట్ ముచ్చట్లేంటో.. మనసారా ఆస్వాదిద్దాం.

వాన ముసురుకున్న వేళ.. కణ కణ మండే బొగ్గులపై వేగిన మొక్కజొన్న పొత్తులను నోరారా తింటుంటే.. ఆ మజానే వేరు కదూ! పిల్లల నుంచి పెద్దల వరకు.. మక్కెన్ రుచుల మజాలో మునిగి తేలనివారు లేరంటే అతిశయోక్తి కాదేమో! తాత, తండ్రుల ఆస్తిలో వారసులు వాటా అడిగినట్టు.. మొక్కజొన్న పొత్తుకు పోటీగా తానున్నానంటూ, కీర్తిలో నాకూ వాటా దక్కాలంటూ.. స్వీట్‌‌కార్న్ స్వీట్‌గా పోటీకొచ్చింది. విదేశీయుల ప్రేమను పొంది, పల్లె ప్రజల మనసునూ దోచుకుందీ స్వీట్ కార్న్. తియ్యని రుచుల మంత్రమేసి అందరినీ వశపరచుకుంది. పల్లెల్లో, పట్టణాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా స్వీట్ కార్న్ స్టాళ్లు కనిపించడమే అందుకు నిదర్శనం.

సుతిమెత్తని తియ్యదనం

మొక్కజొన్న పోత్తులతో పోల్చితే.. స్వీట్ కార్న్ విత్తులు సుతిమెత్తంగా ఉంటాయి. వృద్ధులకు ఇవి తినడం చాలా తేలిక. అన్ని మొక్కజొన్న పొత్తులు తియ్యగా ఉండవు. కానీ ఇవి మాత్రం నోటిని తీపితో నింపుతాయి. రుచి కాస్త భిన్నంగా ఉండటంతో పాటు వాటికి కాసింత కారం, నిమ్మకాయ తగిలిస్తే.. ఆ రుచికి ‘వావ్’ అనాల్సిందే.

పోషకాల గని..

పీచు పదార్థం పుష్కలంగా ఉండటంతో పాటు ఏ, బీ, సీ విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్ తగు మోతాదులో ఉండగా.. నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. చక్కెర, పిండి పదార్థాలు అధికంగా ఉన్నందువల్ల డయాబెటిస్ పేషెంట్స్ తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది. బీ12, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండటంతో.. రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిలో ఇవి తోడ్పడతాయి. అనేమియా తగ్గించడంలోనూ ఇవి సాయపడతాయి. స్కిన్ టెక్చర్‌ను పెంచడంలోనూ ఇవి ‌సూపర్‌గా పనిచేస్తాయి. సెల్ జనరేషన్ ప్రాసెస్‌లో కార్న్ చాలా హెల్ప్ అవుతుంది. అందువల్ల ప్రెగ్నెంట్ మహిళలు ఇవి తినడం చాలా మంచిది. యాక్నేను రిమూవ్ చేయడంలోనూ బెస్ట్‌గా పనిచేస్తుంది. స్కాల్ప్‌లో బ్లడ్ సర్య్కులేషన్ పెంచడంలోనూ, కుదుళ్లను బలపరచడంలోనూ కార్న్ సూపర్ అని చెప్పొచ్చు.

– ఒక కప్పు రా కార్న్‌లో -125 కేలరీలు, 27 గ్రా కార్బోహైడ్రేట్స్, 4 గ్రాముల ప్రొటీన్, 9 గ్రాముల షుగర్, 2 గ్రాముల ఫ్యాట్, 75 ఎమ్‌జీ ఐరస్ ఉంటుంది.

– పదివేల ఏళ్ల క్రితం.. మెక్సికో, సెంట్రల్ అమెరికా దేశాల్లో కార్న్‌ను పండించారు.

Advertisement

Next Story

Most Viewed