ఓటు ఎవరికి వేశారో చెప్పమని వెంటపడుతున్న సర్వే బృందాలు.. మండిపడుతున్న జనం

by Sridhar Babu |   ( Updated:2021-10-31 22:10:47.0  )
Huzurabad-Election
X

దిశ ప్రతినిది, కరీంనగర్: గెలిచేదెవరో ఓడేదెవరో కానీ సర్వే బృందాలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆరు నెలలుగా జరిగిన ప్రీ పోల్ సర్వేలతో సతమతమైన హుజురాబాద్ ప్రజలు పోస్ట్ పోల్ సర్వే ఏజెన్సీలు కూడా హుజురాబాద్ ప్రజలను వెంటాడుతున్నాయి. గ్రామాల్లో తిరుగుతూ ఓటేవరికి వేశారో చెప్పాలంటూ ఆయా టీంల బృందాలు అడుగుతుండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఓ వైపున పొలిటికల్ పార్టీల ప్రచారం, మరో వైపున సర్వే బృందాలకు సమాధానం చెప్పలేక చచ్చామంటే ఇప్పుడు మళ్లీ ఈవీఎంలో నిక్షిప్తం చేసిన అభిప్రాయాలను కూడా వివరించాలంటూ ప్రశ్నలు వేస్తుండడం స్థానికుల సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగానే ఉందని అంటున్నారు.

సర్వేల చరిత్ర

ఒకటి కాదు రెండు కాదు సుమారు వందకు పైగా సర్వే ఏజెన్సీలు హుజురాబాద్ నియోజకవర్గం అంతా అభిప్రాయ సేకరణ జరిపాయి. ఒక్కో ఏజెన్సీ పది సార్ల వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేశాయి. ఓ ఉప ఎన్నికలో ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ స్థాయిలో తిరగడం అత్యంత అరుదే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన సర్వే ఏజెన్సీలతోపాటు ఆయా పొలిటికల్ పార్టీల నాయకులు కూడా కొన్నింటిని రంగంలోకి దింపాయి. ఇందులో అతి ఎక్కువగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఏజెన్సీలు ఎక్కువగా అభిప్రాయ సేకరణ జరిపినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఇంటెలీజెన్స్ వర్గాలు కూడా పెద్ద ఎత్తున హుజురాబాద్ లో ఆరా తీశాయి. ఇంటెలీజెన్స్ వర్గాల ద్వారానే మే మొదటి వారం నుండి ఇప్పటి వరకు వేలాది నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు చెందిన ఇంటెలీజెన్స్ టీమ్స్ లో ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసే కానిస్టేబుల్ వరకూ ప్రతి ఒక్కరూ హుజురాబాద్ లో తిరిగి ప్రజల మద్దతు ఎటువైపో తెలుసుకున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

పోస్ట్ పోల్ సర్వే ఫలితాలివే..

ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. బయటకు లీక్ చేసిన ఏజెన్సీల్లో ఒకటి రెండు తప్ప దాదాపు అన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. అయితే పోస్ట్ పోల్ సర్వే లు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వీణవంక మండలంలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని, హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాలు బీజేపీకి ఆధిక్యత ఉండగా, ఇల్లంతకుంట మండలంలో రెండు పార్టీలకు చెరి సగం పంచుకున్నట్టుగా పోస్ట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థిపై ఫుల్ పాజిటివ్

కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ పై గ్రామాల్లో సానుకూలత వ్యక్తం అయింది. ఆయన ఉపన్యాసం తీరు, ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించిన విధానంపై చాలామంది ప్రజలు పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చారు. అయితే సరైన సమయంలో ఆయన అభ్యర్థి ప్రకటన జరగలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు హుజురాబాద్ ప్రజలు. ఆయన ఇక్కడి ప్రజలతో మమేకమైతే మాత్రం వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా మారే అవకాశాలు ఉన్నాయని స్థానికులు నిర్మోహమాటంగా చెప్పడం గమనార్హం. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఈటల, కేసీఆర్ మధ్యే కాబట్టి తమ మద్దతు వీరిద్దిరిలో ఎవరికో ఎవరికి ఉంటుందని కొందరు అన్నారు. ఈ సమయంలో వెంకట్ తీరును చూసి అండగా నిలిస్తే గెలిచే అభ్యర్థిని ఓటమివైపు తీసుకెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదని ఈ కారణంగానే వెంకట్ కు అంతగా సపోర్ట్ ఇవ్వలేదని అన్నవారూ లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed