ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తూ శిక్షించొద్దు 

by Harish |
ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తూ శిక్షించొద్దు 
X

దిశ, వెబ్‌డెస్క్: మారటోరియం కాలంలో ఈఎంఐ(EMI) లపై బ్యాంకులు వడ్డీని వసూలు చేయడంపై దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం తుది విచారణ జరిపింది. ఈ సందర్భంగా, వడ్డీపై వడ్డీని చెల్లించడం రుణగ్రహీతలకు మితిమీరిన భారంగా మారుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

కొవిడ్-19 వ్యాప్తి కారణంగా వెసులుబాటు కల్పించిన మారటోరియం కాలంలో ఈఎంఐలపై వడ్డీని వసూలు చేస్తూ రుణగ్రహీతలను శిక్షించవద్దని కోర్టుకు వివరించారు. బ్యాంకులు రుణాల పునర్వ్యవస్థీకరణకు సిద్ధంగా ఉన్న సమయంలో వాయిదా పడిన ఈఎంఐలపై వడ్డీని వసూలు చేస్తూ రుణగ్రహీతలను ఇబ్బంది కలిగించొద్దని కోర్టుకు విన్నవించారు.

మారటోరియం కాలంలో ఈఎంఐలపై వడ్డీలు భారీగా పెరిగాయని, దీనివల్ల రుణగ్రహీతలు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని పిటిషన్ వేసిన గజేంద్ర శర్మ కోర్టుకు చెప్పారు. మార్చిలో కొవిడ్-19 వ్యాప్తి కారణంగా చాలామంది ఆదాయాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఆర్‌బీఐ మూడు నెలలపాటు రుణాలపై మారటోరియం వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో దీన్ని ఆగష్టు చివరి వరకూ పొడిగించింది. ఈ క్రమంలో రుణాల చెల్లింపులపై మారటోరియంను రెండేళ్లు పెంచే అవకాశం ఉందని, వివిధ రంగాలను ఆదుకోవడానికి కేంద్రం, ఆర్‌బీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కోర్టుకు తెలిపాయి. అంతేకాకుండా వడ్డీ మాఫీ అంశం మౌలిక సూత్రాలకు విరుద్ధమని, రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నవారికి అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది.

Advertisement

Next Story

Most Viewed