‘దిశ ఎన్‌కౌంటర్’.. మరో ఆరు నెలలు?

by Shamantha N |   ( Updated:2020-07-24 09:53:33.0  )
‘దిశ ఎన్‌కౌంటర్’.. మరో ఆరు నెలలు?
X

న్యూఢిల్లీ: దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను విచారిస్తున్న ఎంక్వైరీ ప్యానెల్‌ నివేదిక సమర్పించడానికి గడువును మరో ఆరునెలలు సుప్రీంకోర్టు పొడిగించింది. ప్యానెల్ అభ్యర్థనకు మేరకు సుప్రీంకోర్టును ఈ గడువును పెంచింది. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నివారించలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, అందుకే నిర్దేశించిన సమయంలోపు దర్యాప్తును పూర్తి చేయలేకపోతున్నామని ఈ ప్యానెల్ సుప్రీంకోర్టుకు తెలిపింది. అందుకే దర్యాప్తుపై తుది నివేదిక అందించడానికి మరో ఆరు నెలల గడువు ఇవ్వాలని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి విన్నవించింది. ఈ అభ్యర్థనను స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం గడువును మరో ఆరునెలలు పొడిగించింది.

గతేడాది డిసెంబర్ 6న దిశ హత్యాచార కేసులోని నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఆ ఘటనను విచారించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ వీఎస్ సిర్పూర్కార్ నేతృత్వంలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా సొందూర్ బల్దోతా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్‌లతో కూడిన ఎంక్వైరీ కమిషన్‌ను సుప్రీంకోర్టు నియమించింది. ఆరునెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తాజాగా, ఈ గడువును పెంచాలని కమిషన్ అభ్యర్థించగా పొడిగించింది.

Advertisement

Next Story

Most Viewed