అదంతా దుష్ప్రచారమే

by Shyam |
అదంతా దుష్ప్రచారమే
X

దిశ, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఖండించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సేవల కోసం కూలీ కుతుబ్ షాహి భవనంలో ఇప్పటికే 100 పడకలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే నాల్గో అంతస్థులో కొత్తగా 250 పడకలు మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

ఐసోలేషన్ వార్డ్‌లో 14 నుంచి 20 పడకలతో ఉండగా ప్రస్తుతం 100కి పైగా ఉండేలా వార్డును విస్తరించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఉస్మానియాలో 85 వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా మరో 10 కొత్త వెంటిలేటర్లు సమకూర్చామన్నారు. పడకలు, వెంటిలేటర్లు లేవని చెప్పి ఏ ఒక్క రోగిని కూడా తిప్పి పంపలేదని, ఇలా వస్తున్న వదంతులు పూర్తిగా అవాస్తవమని డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు. క్లిష్ట సమయంలోనూ వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, ఇలాంటి సమయంలో తమకు అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed