కొడుకు కోసం కుటుంబాన్ని వీడి ఉంటున్న వాషింగ్టన్ సుందర్ తండ్రి

by Shyam |
Washington sunder
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం. సుందర్ కొన్ని రోజులుగా కుటుంబంతో కాకుండా విడిగా వేరే ఇంటిలో ఉంటున్నారు. తన కుమారుడికి కోవిడ్-19 సోకకుండా ఆయన ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. స్వతహాగా క్రికెటర్ అయిన ఎం. సుందర్ ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ చెన్నై కార్యాలయంలో పని చేస్తున్నారు. దీంతో వారంలో రెండు మూడు రోజులు ఆఫీసు పనుల కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. కాగా, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే క్రికెటర్లు ఎవరైనా కరోనా బారిన పడితే వారిని జట్టు నుంచి తప్పిస్తామని బీసీసీఐ ఇప్పటికే చెప్పింది.

దీంతో తన కుమారుడు కరోనా బారిన పడకూడదని ఆయన అలా విడిగా ఉంటున్నారు. సుందర్, అతడి తల్లి, సోదరి అందరూ ఒక దగ్గరే ఉంటున్నారు. కానీ బయటకు తిరుగుతున్న సుందర్ తండ్రి మాత్రం విడిగా వేరే ఉంటున్నారు. 2018లో సుందర్ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఛాన్స్ రాలేదు. సుందర్‌కు లార్డ్స్ వంటి మైదానాల్లో ఆడాలని చిన్నప్పటి కోరిక. ఇప్పుడా అవకాశాన్ని చెడగొట్టొద్దనే ఉద్దేశంతోనే సుందర్ తండ్రి అలా విడిగా ఉంటున్నారు. కొడుకు కోసం ఇంటి నుంచి దూరంగా ఉంటూ.. కేవలం వీడియో కాల్స్ ద్వారా మాత్రమే టచ్‌లో ఉంటున్న సుందర్ తండ్రిని అందరూ ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed