నగరంలో భారీ వర్షం

by Shyam |   ( Updated:2020-08-09 10:32:57.0  )
నగరంలో భారీ వర్షం
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆదివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటల పాటు భారీ వర్షం కురవడంతో దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి, కర్మన్‌ఘాట్, సంతోష్‌నగర్, మలక్‌పేట్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్, మియాపూర్, తదితర ప్రాంతాల్లో చల్ల గాలులతో కూడిన వర్షం కురిసింది.

దీంతో పలు ప్రాంతాలలో రోడ్లపై వర్షం నీరు చేరి వాహనదారులు ఇబ్బందుల పాలు కాగా, వాతావరణం చలి కాలాన్ని తలపించింది. కొన్నిచోట్ల రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందుల పాలయ్యారు. సాయంత్రం మొదలైన వర్షం గంటల తరబడి కురుస్తూనే ఉండడంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు, పనుల మీద బయటకు వచ్చిన వారు అనేక పాట్లు పడ్డారు.

నిలిచిపోయిన విద్యుత్ సరఫరా …..

హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓ వైపు వర్షం, మరో వైపు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో రంగంలోకి దిగి సరఫరాను పునరుద్ధరించారు. మొత్తం మీద నగరంలోని చాలా ప్రాంతాలలో కురిసిన వర్షం ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

Advertisement

Next Story

Most Viewed